Viveka Murder Case : జగన్, అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పారు, సునీత వాంగ్మూలంలో సంచనాలు వెలుగులోకి
Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో సంచనాలు వెలుగుచూస్తు్న్నాయి. వివేకా కుమార్తె సునీత వాంగ్మూలంలో వైఎస్ భారతి, సజ్జలపై చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
Viveka Murder Case : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు ప్రస్తావించింది సీబీఐ. వివేకా కుమార్తె సునీత దర్యాప్తులో వెల్లడించిన కీలక విషయాలను ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది సీబీఐ. వైఎస్ భారతి 2019 మార్చి 22న... ఇంటికొచ్చి కలుస్తానంటూ తనకు ఫోన్ చేశారని సునీత తెలిపారు. తనకు పనిఉందని చెప్పడంతో ఎక్కువ సమయం తీసుకోనని చెప్పి... భారతి, వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ రెడ్డి మా ఇంటికి వచ్చారన్నారు. ఆ సమయంలో భారతి కొంత ఆందోళనకరంగా కనిపించారన్నారు. వివేకా మరణించిన తర్వాత పలకరింపునకు తొలిసారి ఇంటికొచ్చినందుకు అలా బాధగా ఉన్నారని అనుకున్నానన్నారు. అప్పుడు భారతి ఇకపై ఏం చేసిన సజ్జలతో టచ్‌లో ఉండాలని చెప్పారన్నారు. వివేకా హత్యపై మీడియాతో మాట్లాడాలని తనకు సజ్జల చెప్పారన్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు జగనన్నతో పాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని సలహా ఇచ్చారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టం చేశారు. సునీత ఓ వీడియో రికార్డు చేసి సజ్జలకు పంపిస్తే.. వీడియో కాదు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అది తనకు ఇబ్బందిగా అనిపించిందన్నారు సునీత. అవినాష్ అభ్యర్థిత్వాన్ని వివేకా కోరుకోలేదన్నారు. మా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయని సునీత వాంగ్మూలంలో పేర్కొన్నారు.
వివేకా ఇంట్లో వైఫై రూటర్ల సమాచారం కీలకం
వివేకా హత్య కేసు ఛార్జ్ షీట్ లో ఫొటోలు, గూగుల్ టేకౌట్, లోకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు వైఎస్ అవినాశ్, భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని వెల్లడించింది. వివేకా హత్య కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపింది. పీఏ కృష్ణారెడ్డిపై కూడా అనుమానాలు ఉన్నాయని, అయితే ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ హత్యలో అతని ప్రమేయం నిర్ధారణ కాలేదన్నారు. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టు అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది. వైఫై రూటర్స్ నుంచి వివరాల కోసం అమెరికా అధికారులను సంప్రదించామన్నారు. వివేకా లేఖపై నిన్ హైడ్రేన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వీటి ఫోరెన్సిక్ నివేదిక అందాల్సివుందని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
రాజకీయకారణాలతో హత్య
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు నుంచి విచారిస్తున్న సీబీఐ వైఎస్ షర్మిలను కూడా సాక్షిగా ప్రస్తావించింది. 259వ సాక్షిగా పేర్కొంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ... కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు విచారించిన వారి వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది. ఇందులో కీలక విషయాలు ప్రస్తావించింది. హత్య జరగటం, బయటి రావటంతో పాటు.. ఎవరికి ఎవరు సమాచారం ఇచ్చారు వంటి అంశాలను పేర్కొంది. వైఎస్ఆర్టీసీ అధినేత్రి షర్మిల గత ఏడాది అక్టోబర్ 7న దిల్లీలో ఈ కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చారని సీబీఐ తెలిపింది. తన వద్ద ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని, అయితే రాజకీయ కారణాలతో హత్యకు పాల్పడ్డారని వైఎస్ షర్మిల చెప్పినట్లు వివరించింది. హత్య వెనుక కుటుంబం లేదా ఆర్థిక అంశాల ప్రమేయం లేదన్న విషయాన్ని ఆమె ఖండించినట్లు పేర్కొంది. కడప ఎంపీగా పోటీ చేయాలని తనని వైఎస్ వివేకా కోరారని… ఎంపీగా అవినాష్ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది.