YS Viveka Case : వివేకా హత్య కేసులో మరో సంచలనం, రహస్య సాక్షిని తెరపైకి తెచ్చిన సీబీఐ-ys viveka murder case cbi investigation secret evidence submit to high court in sealed cover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ys Viveka Murder Case Cbi Investigation Secret Evidence Submit To High Court In Sealed Cover

YS Viveka Case : వివేకా హత్య కేసులో మరో సంచలనం, రహస్య సాక్షిని తెరపైకి తెచ్చిన సీబీఐ

Bandaru Satyaprasad HT Telugu
May 28, 2023 09:28 AM IST

YS Viveka Case : వివేకా హత్య కేసులో సీబీఐ మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. ఓ రహస్య సాక్షి వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పిస్తామని స్పష్టంచేసింది. ఆ వాంగ్మూలం మేరకు తీర్పు ఇవ్వాలని కోరింది.

వైఎస్ అవినాష్ రెడ్డి
వైఎస్ అవినాష్ రెడ్డి

YS Viveka Case : వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో సంచనాలు వెలుగులోకి వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే వివేకా హత్య బాహ్య ప్రపంచానికి తెలిసే ముందే జగన్ కు సమాచారం చేరిందని.. సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో తెలిపింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చింది. బుధవారం తుది తీర్పు ఇచ్చే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సూచించింది. అయితే హైకోర్టు మధ్యంతర తీర్పునకు ముందు సీబీఐ సుదీర్ఘంగా వాదనలు వినిపించింది. ఈ వాదనల్లో ఓ రహస్య సాక్షి ఉన్నారని సీబీఐ తెలిపింది. ఆ రహస్య సాక్షి ఎవరా? అని చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఊహించని పరిణామాలు

వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి విచారణకు తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే సీబీఐ వాదిస్తుంది. కర్నూలులో దాదాపు అరెస్టు వరకూ వెళ్లినా... స్థానిక పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. తాజాగా సీబీఐ బయట పెడుతున్న విషయాలు సంచలనం అవుతున్నాయి. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో జగన్ పేరు ప్రస్తావించిన సీబీఐ.. నిన్న జరిగిన వాదనల్లో ఓ రహస్య సాక్షి గురించి చెప్పింది. ఈ వ్యవహారంలో పక్కా సాక్ష్యాలతో రహస్య సాక్షి సీబీఐకి సహకరిస్తున్నారని తెలుస్తోంది. సీబీఐ ఈ కేసును వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నట్లుగా సమాచారం. అవినాష్ రెడ్డికి లభిస్తున్న ఊరటలపై కూడా సీబీఐ ఆరా తీస్తుంది. ఈ కేసు విచారణలో సీబీఐ చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని తెలుస్తోంది. అయినా ఎక్కడా తగ్గకుండా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. ఇంతకాలం రహస్య సాక్షి విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన సీబీఐ... తాజా ఈ విషయాన్ని ప్రస్తావించింది. కేసు విచారణ తుదిదశకు వచ్చిందని, అందుకే సీబీఐ కీలక విషయాలు ప్రస్తావిస్తోందని తెలుస్తోంది.

రహస్య వ్యక్తి వాంగ్మూలం సీల్డ్ కవర్ లో సమర్పిస్తాం

అవినాష్‌ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వడం వివేకానందరెడ్డికి ఇష్టం లేదని, కావాలంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారని రహస్య సాక్షి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఏప్రిల్‌ 26న నమోదు చేసిన ఈ వాంగ్మూలాన్ని వచ్చే కౌంటర్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తిని సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఆ వ్యక్తి పేరును, వాంగ్మూలాన్ని బయటపెట్టలేమని వెల్లడించింది. బయటపెడితే ఏమవుతుందో గత సంఘటనలు చూస్తే తెలుస్తుందని పేర్కొంది. వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి సూసైడ్, ముందు వాంగ్మూలం ఇచ్చిన సీఐ శంకరయ్య తర్వాత నిరాకరించడం సంఘటనలు ఇందుకు రుజువని కోర్టుకు తెలిపింది. అందుకే వాంగ్మూలాన్ని కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తామని తెలిపింది. ఆ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చని కోర్టును కోరింది. అయితే పిటిషనర్‌కు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా సీబీఐ ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించి ఉత్తర్వులు జారీచేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్‌కు వివరాలు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయొచ్చని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులుంటే హైకోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

IPL_Entry_Point