YS Viveka Case : ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్!-ys viveka murder case cbi filed affidavit in supreme court cancel ysrcp mp avinash reddy bail ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ys Viveka Murder Case Cbi Filed Affidavit In Supreme Court Cancel Ysrcp Mp Avinash Reddy Bail

YS Viveka Case : ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్!

Bandaru Satyaprasad HT Telugu
Sep 03, 2023 03:06 PM IST

YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రదారులని సీబీఐ పేర్కొంది.

వైఎస్ వివేకా హత్య కేసు
వైఎస్ వివేకా హత్య కేసు

YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అఫిడవిట్ లో ప్రస్తావించింది. వివేకా హత్యకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ పేర్కొంది. రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ అభియోగించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా విచారించాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. హత్య జరిగితే గుండెపోటు అని ప్రచారం చేశారని సీబీఐ పేర్కొంది. వివేకాతో పాటు కారులో వెళ్లిన నిందితుడు సునీల్‌కి గంగిరెడ్డి ఫోన్ చేశారని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నాడని సీబీఐ అఫిడవిట్ లో తెలిపింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రదారులని అఫిడవిట్‌లో సీబీఐ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

రాజకీయ విభేదాలు

వైఎస్ వివేకాతో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు రాజకీయ విభేదాలు ఉన్నాయని సీబీఐ అఫిడవిట్ లో తెలిపింది. ఈ విభేదాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించారని పేర్కొంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు లేదా షర్మిల విజయమ్మల్లో ఒకరికి ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి... రాజకీయంగా అడ్డుతగుతున్నారన్న కారణంతో వివేక హత్యకు కుట్ర చేశారని, ఇందుకు సంబంధించిన తగిన సాక్షాధారాలు లభించాయని సీబీఐ వివరించింది.

ఈ నెల 11న విచారణ

వివేకా హత్య అనంతరం సాక్ష్యాలు చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణ హైకోర్టులో ఈ అంశం విచారణ జరిగిందని తెలిపింది. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు మెయిల్ మంజూరు చేసిన విషయం ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రతి శనివారం అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతున్నారని సీబీఐ తెలిపింది. అయితే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడంపై సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీతా వాదనలను విన్న కోర్టు.. ఈ కేసు విచారణను ఈనెల 11న చేపడతామని తెలిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. దీంతో సీబీఐ గతంలో ప్రస్తావించిన అంశాలనే మరోసారి ఈ కౌంటర్ అఫిడవిట్ లో తెలిపింది.

WhatsApp channel