YS Sharmila : జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం సిగ్గుచేటు - వైఎస్ షర్మిల
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని వైఎస్ షర్మిల విమర్శించారు. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం సిగ్గుచేటన్నారు.
కడప కలెక్టర్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ…చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా స్టీల్ ప్లాంట్ పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం నాడు వైఎస్సార్ చిత్తశుద్ధితో దీన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
10వేల ఎకరాల్లో రూ.20వేల కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నది వైఎస్ఆర్ ఆశయమని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. సెయిల్ ద్వారానే ప్లాంట్ నిర్మించాలని విభజన హామీల్లో ఉందని… 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే నిర్మాణం జరిగి ఉండేదన్నారు.
ఏపీ పట్ల బీజేపీకి చిన్నచూపు ఉందని వైఎస్ షర్మిల చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన హామీలను సైతం ఆ పార్టీ తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “2019లో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టారు నాటి సీఎం చంద్రబాబు గారు. 4వేల ఎకరాల్లో 3 మిలియన్ టన్నులు ప్లాంట్ కట్టాలని చంద్రబాబు అనుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారు. మూడేళ్లలో నిర్మాణం చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని జగన్ నాడు ఆస్కార్ డైలాగులు చెప్పారు. మళ్లీ మూడు సంవత్సరాల తర్వాత 2023లో కొబ్బరికాయ కొట్టారు. పదేళ్లు ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో ఏం చేశారో సమాధానం చెప్పాలి” అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లని జగన్‌కు ఎమ్మెల్యే పదవి ఎందుకో? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలని గెలిపించుకోలేని జగన్.. ప్రతిపక్ష హోదా కావాలని అడగటం సిగ్గుచేటు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమబాట పడుతుందని హెచ్చరించారు. అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమని చెప్పారు.