YS Sharmila On CBN: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న.. చంద్ర బాబుపై వైఎస్‌ షర్మిల ఫైర్‌-ys sharmila sharply criticizes chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila On Cbn: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న.. చంద్ర బాబుపై వైఎస్‌ షర్మిల ఫైర్‌

YS Sharmila On CBN: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న.. చంద్ర బాబుపై వైఎస్‌ షర్మిల ఫైర్‌

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 17, 2025 10:39 AM IST

YS Sharmila On CBN: ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో సూపర్‌ సిక్స్‌ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన చంద్రబాబు అమలు చేయడానికి మాత్రం మడత పేచీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుపై వైఎస్ షర్మిల విమర్శలు
చంద్రబాబుపై వైఎస్ షర్మిల విమర్శలు

YS Sharmila On CBN: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రన స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తీరు ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోందని ఎద్దేవా చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు అమలు కొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని విమర్శించారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు వ్యవహారం ఆడలేక మద్దెల దరువన్నట్లుందని విమర్శించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చంద్రబాబుకు తెలియదా అని నిలదీశారు.

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని, రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు.

రాష్ట్రానికి సహాయ పడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసమన్నారు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా..పనితనం శూన్యంగా ఉందన్నారు.

ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా అవుతుందని, హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని, నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యం అన్నారు.

Whats_app_banner