Amaravati : ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది చంద్రబాబు తీరు : షర్మిల-ys sharmila satires on chandrababu naidu regarding amaravati land acquisition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati : ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది చంద్రబాబు తీరు : షర్మిల

Amaravati : ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది చంద్రబాబు తీరు : షర్మిల

Amaravati : రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం మరికొంత భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఈ అంశంపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. రైతుల నుంచి తక్కువ ధరకే భూములు తీసుకొని.. చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ షర్మిల

ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు తీరు.. అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కులేదని విమర్శించారు. పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట.. అందులో అద్భుత ప్రపంచం కడతాడట.. అని ఎద్దేవా చేశారు.

బాబుకే తెలిసిన విద్య..

'అరచేతిలో వైకుంఠం చూపించడం, ఏఐ పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబుకే తెలిసిన విద్య. రాజధాని విస్తరణ పేరుతో, విలువైన రైతుల భూములను మళ్లి అగ్గువకే కాజేసి.. తన అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్పా మరోటి కాదు. కూటమి ప్రభుత్వానికి భూదోపిడిపై పెట్టే శ్రద్ధ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదు' అని షర్మిల విమర్శించారు.

ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం..

'ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదు. అఖండ అమరావతికి మోకాలడ్డు మా ఉద్దేశ్యం అంతకన్నా కాదు. కానీ సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు, ఎటు చూసినా పడావుబడిన భూములు ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం? సింగపూర్ తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

చిత్రాలతో విచిత్రాలు..

'రాజధానిని ముందు నిలబెట్టకుండా.. ఒక రూపం అంటూ తీసుకురాకుండా..చిత్రాలతో విచిత్రాలు చేస్తూ.. ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా? ఫేజ్ 1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మిగలడం ఏంటి? సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారు? ఏ సంస్థలకు కేటాయించారు? ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు? చంద్రబాబు సమాధానం చెప్పాలి. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది' అని షర్మిల ట్వీట్ చేశారు.

భవిష్యత్తు అవసరాల కోసం..

రాజధాని నగరం అమరావతి కోసం 44,676 ఎక‌రాల భూమిని స‌మీక‌ర‌ణలో సేకరించాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. 2014-19 మధ్య కాలంలో 29 గ్రామాల్లో 34వేల ఎకరాలను రాజధాని కోసం సేకరించారు. ఈ భూమిలో తొలి దశలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. రాజధాని విస్తరణ, భవిష్యత్తు అవసరాల కోసం అమరావతిలో మరో 44వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం