YS Sharmila vs YS Jagan : 'చెల్లి, తల్లిని కోర్టుకు ఈడ్చారు - జగన్ సార్.. ఇది సామాన్యం కాదు' - వైఎస్ షర్మిల కౌంటర్
ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యం అంటూనే, తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారని అన్నారు. "ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్' అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరినట్లు అయింది.
తన ఫ్యామిలిలో ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. తమ ఉద్దేశ్యం కూడా గొడవలు పెట్టుకోవాలని కాదని చెప్పారు. సామరస్యంగా, నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని తెలుసన్నారు. "కానీ ఇది సామాన్యం అంటూనే.. అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఈడ్చాడు. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్' అంటూ షర్మిల కామెంట్స్ చేశారు.
ఇవాళ విజయనగరం జిల్లాలోని గుర్లలోపర్యటించిన వైఎస్ జగన్… ఆస్తుల వివాదంపై స్పందించారు. అందరి ఇళ్లలో ఇలాంటి సమస్యలు ఉంటాయని.. వాటిని చూపించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా డైవర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన తల్లి, చెల్లి ఫొటోతో సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. కుటుంబ కలహాలు అందరి ఇళ్లల్లో సామాన్యంగా ఉండేవేనని.. ప్రతీ ఇంట్లో ఉన్న గొడవలే తమ ఇంట్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రచారం ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల పరోక్షంగా స్పందిస్తూనే… కౌంటర్ ఇచ్చారు. సామాన్యం అంటూనే కోర్టుకు ఈడ్చారని అన్నారు. ఇది సామాన్యమేమి కాదంటూ కామెంట్స్ చేశారు. మొత్తంగా వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరినట్లు అయింది.
వైఎస్ జగన్ పిటిషన్:
ఏపీలో ఎన్నికల కంటే ముందు నుంచే వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు తెరపైకి వచ్చాయి. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్ రెడ్డి లక్ష్యంగా వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. ఏకంగా కాంగ్రెస్ లో పార్టీలో చేరి… కడప ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా షర్మిల ఉన్నారు. మరోవైపు అధికారం కోల్పోయిన జగన్… ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు.
రాజకీయంగా జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నా చెల్లెళ్ల మధ్య లేఖ యుద్ధం కాస్త నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను చేరింది. జగన్‌కు తెలియకుండా, అమోదం లేకుండా షేర్ల బదిలీ చేసుకోవడంతో వివాదం ముదిరింది.
వైఎస్ జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019లో ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆస్తులు, కంపెనీలలో వాటాల బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు. 2021 జులై 26న మరో గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు. ఈ మేరకు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లలో తమ వాటాలను వైఎస్ విజయమ్మ పేరిట, జగన్ సతీమణి భారతీ రెడ్డి బదిలీ చేశారు.
2019 ఆగస్టు 31న ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు మొత్తం 13 ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు. జగన్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసులతో పాటు దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత వీటి పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు.
2021 మార్చిలో జగన్ చేసిన గిఫ్ట్ డీడ్ ఆధారంగా సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన షేర్లను షర్మిల తన పేరిట బదిలీ చేసుకున్నారు. షేర్ల బదిలీకి సంబంధించి గిఫ్ట్ డీడ్ ఆధారంగా షర్మిల తరపు ఆడిటర్ వాటిని ఆమె పేరిట బదలాయిస్తూ బోర్డు తీర్మానాన్ని ఆర్వోసీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో సదరు ఆస్తులు ఈడీ జప్తులో ఉండటంతో కంపెనీ వ్యవహారాల శాఖ ఈడీకి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. విషయం కాస్త జగన్ దృష్టికి రావటంతో..షేర్ల బదిలీపై ఆరా తీశారు. ఆగస్టు 27న షర్మిలకు రాసిన లేఖలో జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేసేలా విమర‌్శలు చేస్తున్న అంశాన్ని అందులో ప్రస్తావించారు. ఆస్తుల పంపకంపై ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పలు సందర్భాల్లో దాదాపు రూ.200కోట్ల రుపాయల నగదును దశాబ్ద కాలంలో ఆమెకు చెల్లించినట్టు లేఖలో పేర్కొన్నారు. చెల్లెలిపై ప్రేమ, అప్యాయతతో ఆస్తుల పంపకానికి అంగీకరించినట్టు అందులో ప్రస్తావించారు.
ఇదిలా ఉండగానే జగన్ దంపతులు.. NCLTని ఆశ్రయించారు. తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మపై పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్.. NCLTను ఆశ్రయించారు. సెప్టెంబర్ 10న ఎన్‌సిఎల్‌టిలో జాబితా చేయబడిన ఈ కేసు… కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలు చేయబడింది.
ఈ కేసులో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్ విజయమ్మ, చగరి జనార్థన్ రెడ్డి, యశ్వనాథ్ రెడ్డి కేతిరెడ్డితో పాటు రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెన్స్ తెలంగాణ పేర్లను ప్రతివాదులుగా చేర్చారు.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వృద్ధిలో తమ పాత్ర కీలకంగా ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశామని తెలిపారు. అయితే… వాటా కేటాయింపు ఇప్పటికీ ఖరారు కాలేదని… ఇది ప్రస్తుత వివాదానికి దారి తీసిందని పిటిషన్ లో ప్రస్తావించారు.
పిటిషన్ ను స్వీకరించిన NCLT… ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8, 2024కి షెడ్యూల్ చేసింది. ఈ కేసు దాఖలు నేపథ్యంలో… సరస్వతి పవర్ మరియు ఇండస్ట్రీస్‌పై మాత్రమే కాకుండా వైఎస్ కుటుంబంలోని విబేధాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయిందన్న చర్చ వినిపిస్తోంది.
సంబంధిత కథనం