YS Sharmila: ఇడుపులపాయలో షర్మిల.. కొడుకు, కుమార్తె పేరిట భూముల రిజిస్ట్రేషన్
YS Sharmila in Pulivendula: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం పులివెందులకు చేరుకున్నారు. ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. షర్మిల, విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ నుండి ఇడుపులపాయ వచ్చారు. కడప విమానాశ్రయం నుంచి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాలను షర్మిల తన తనయుడు రాజారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుండి కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కూతురు అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వారి కుటుంబం ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుంది.
ట్రెండింగ్ వార్తలు
ఇవాళ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. మరోవైపు తెలంగాణలో సీరియస్ పాలిటిక్స్ చేస్తున్న షర్మిల… ఓ పార్టీని కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ లో కలుస్తారన్న చర్చ జోరుగా వినిపిస్తోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు షర్మిల. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు మాత్రం హింట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా కేవీపీ కూడా షర్మిల చేరిక విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల తన పేరిట ఉన్న భూములను కుమారుడు, కుమార్తె పేరిట రిజిస్ట్రేషన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై షర్మిల కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.