YS Sharmila On Wine shops : లిక్కర్ మాఫియా నడుస్తోంది - జగన్, చంద్రబాబుకి పెద్ద తేడా లేదు - వైఎస్ షర్మిల
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శులు గుప్పించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ దుకాణాల విషయంలో జగన్‌కి, చంద్రబాబుకి పెద్ద తేడా లేదంటూ దుయ్యబట్టారు.
లిక్కర్ విషయంలో జగన్‌కి, చంద్రబాబుకి పెద్ద తేడా లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలను అమాంతం పెంచేసి లిక్కర్ మాఫియాను గుప్పిట్లో పెట్టుకున్నారని చెప్పారు. జగన్ హయాంలో కేవలం క్యాష్ ద్వారానే నాసిరకం మద్యం అమ్మి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి - వైఎస్ షర్మిల
సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు గారిని ఒక విషయంలో మాత్రం స్వాగతిస్తున్నాం. జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే. కానీ రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయిలో ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువత వలస వెళ్ళింది. నిన్న చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 40-50 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన బాబు చెప్పినట్లు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే...5 ఏళ్లలో 20 లక్షలు వస్తాయి అనుకుందాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి …?" అంటూ ప్రశ్నించారు.
“20 కోట్ల ఉద్యోగాలు అని గతంలో మోదీ ప్రభుత్వం కూడా మోసం చేసింది. 20 కోట్ల ఉద్యోగాలలో మనకు ఎన్ని వచ్చాయి ? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని మోడీకి ఎందుకు బాబు మద్దతు ఇస్తున్నారు..? రాష్ట్రంలో మీరు ఇచ్చే 20 లక్షలకు తోడు మరో 30 లక్షల ఉద్యోగాలు మోడీ ఇవ్వాలి. ఈ మేరకు బాబు కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. మోడీ,బాబు ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగాల కల్పనపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి” అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
లోకేశ్ పై షర్మిల ఫైర్…
విద్యాశాఖ మంత్రి లోకేశ్ పై ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. “అయ్యా లోకేష్ గారు... మీరు ఇచ్చిన మాట సరే...మోడీ ఇచ్చిన మాట పరిస్థితి ఏంటి..? రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీలు అందరూ మోడీకి ఊడిగం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో లక్షలాది ప్రజల ముందు నిలబడి మరి మోడీ మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట ఎక్కడ పోయింది” అని షర్మిల ప్రశ్నించారు.
“పోలవరం పూర్తి చేస్తా అన్నారు. అమరావతిని న్యూఢిల్లీని మించిన రాజధానిని చేస్తా అన్నారు. చివరకు మట్టి కొట్టి పోయారు. అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చే బాధ్యత నాది అని మోదీ అన్నారు. కానీ ఇంతవరకు అవి నెరవేర్చలేదు. విశాఖ స్టీల్ కి ఒక్క క్యాపిటల్ మైన్ ఇస్తే మోడీకి జరిగే నష్టం ఏముంది..? మొన్నటికి మొన్న 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించారు. నేను నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరిస్తే వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మీరు మోడీకి ఇచ్చిన మాట బాగానే నిలబెట్టుకున్నారు. మరి రాష్ట్రానికి మోడీ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు. తక్షణమే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని లోకేశ్ నిలదీసి అడగాలి” అని షర్మిల డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం