YS Jagan Meets Vamsi: చంద్రబాబువి కక్ష సాధింపు చర్యలు.. ఏపీలో శాంతి భద్రతలపై జగన్ ఆందోళన, జైల్లో వంశీతో ములాఖత్
YS Jagan Meets Vamsi: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వంశీని అరెస్ట్ చేశారు.

YS Jagan Meets Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయవాడ జైల్లో ములాఖత్ అయ్యారు. గత వారం వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేయగా న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్‌ను కిడ్నాప్ చేసి బలవంతంగా ఫిర్యాదు ఉపసంహరించుకున్నారనే అభియోగాలపై వంశీని అరెస్ట్ చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై సార్వత్రిక ఎన్నికలకు ముందు వంశీ దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం దగ్ధం అయ్యింది. ఈ దాడిపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్‌ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించి బలవంతంగా కేసు ఉపసంహరించుకునేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలో కిడ్నాప్ చేసి హైదరాబాద్, విశాఖపట్నంలో సత్యవర్ధన్‌ను బంధించి బలవంతంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు ఈ కేసులో వంశీని గత వారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
వంశీతో పాటు అతని అనుచరులను కూడా ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీని వైసీపీ అధ్యక్షుడు జైల్లో పరామర‌్శించారు. జగన్ రాక సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌తో పాటు వంశీ భార్యను ములాఖత్‌కు అనుమతించారు.
రాష్ట్రంలో క్షీణించిన శాంత భద్రతలు..
వంశీని అరెస్ట్ చేసిన తీరు, అతని మీద పెట్టిన ఫాల్స్ కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు గమనిస్తే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోందన్నారు. ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఎప్పుడూ వంశీ పేరు చెప్పలేదన్నారు.
2023 ఫిబ్రవరిలో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకుడు పట్టాభితో వంశీని తిట్టించారని, ఫిబ్రవరి 19, 2023న పట్టాభి వంశీని “వాడు ఒక పిల్ల సైకో, నియోజక వర్గంలో నుంచి విసిరేస్తా” అని వంశీని రెచ్చగొట్టింది పట్టాభి అని జగన్ ఆరోపించారు.
ఫిబ్రవరి 20న చంద్రబాబు.. పట్టాభిని నేరుగా గన్నవరం పంపి, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తిట్టించారని, గన్నవరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పోగేసిన మనుషులతో గుంపుగా వైసీపీ కార్యాలయంపై దాడి చేసేందుకు పట్టాభి బయల్దేరాడని, ఈ ఘటనలో ఫిబ్రవరి 20న వైసీపీ కార్యాలయానికి వెళ్లి, శీనయ్య అనే దళిత సర్పంచిపై దాడి చేశారని, ఈ దాడి జరుగుతున్న క్రమంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు నిలువరించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని, ఆ క్రమంలో సీఐ కనకరావు తల పగులగొట్టారని జగన్ ఆరోపించారు.
ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయం వైపు వెళ్లారని, రెండు వైపులా కేసులు నమోదు చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెండు వర్గాల మీద తాము కేసులు నమోదు చేశామని జగన్ చెప్పారు. గన్నవరం ఘటనలో అప్పటి పోలీసులు సుమోటోగా టీడీపీ, వైసీపీ వారి మీద కేసులు నమోదు చేశారని, ఈ క్రమంలో టీడీపీ వారు ఇచ్చిన మూడు ఫిర్యాదులు కూడా నమోదు చేశారని జగన్ చెప్పారు.
పోలీసులు పెట్టిన కేసుల్లో వంశీ పేరు ఎక్కడా లేదని, ఆ ఘటనలో వంశీ ప్రత్యక్షంగా లేడని, ఘటనా స్థలంలో వంశీ పేరును ఎవరు చెప్పలేదన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను మంగళగిరిలో టీడీపీ ఆఫీసుకు పిలిపించి తెల్ల కాగితంపై సంతకంపై సంతకాలు తీసుకుని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని, ఆ కేసులో కూడా వంశీ పేరు లేదన్నారు.
2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్ధన్‌తో 161 స్టేట్‌మెంట్ తీసుకున్నారని, అందులో వంశీ పేరు ఎక్కడ లేదని , వంశీ గురించి సత్యవర్ధన్ ఎక్కడా చెప్పలేదన్నారు. వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా వంశీని 71వ నిందతుడిగా కేసులో చేర్చారని, ఈ క్రమంలో వంశీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబు కుట్రలు పన్ని కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 94మందిపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు.
సప్త సముద్రాల అవతల ఉన్నా వదలను…
పోలీసులు టీడీపీ నాయకులకు సెల్యూట్ కొడుతూ, అన్యాయాలు చేస్తే ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలని, రేపు వైసీపీ అధికారంలోకి వచ్చినపుడు, అన్యాయం చేసిన నాయకుల్ని, అధికారుల్ని బట్టలూడదీసి నిలబెడుతానని జగన్ వార్నింగ్ ఇచ్చారు.
వంశీని అరెస్ట్ చేసే సమయంలో సీఐ తాను ఏడాది రిటైర్ అయిపోతానని చెప్పాడని, సప్త సముద్రల అవతల ఉన్నావారిని బట్టలు ఊడదీసి నిలబెడతానని జగన్ హెచ్చరించారు. అన్యాయంలో భాగస్వాములు కావొద్దని, పోలీసులు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారని, పారిశ్రామిక వేత్తల్ని వదలడం లేదని, వీళ్లే బెదిరించి అవతల వారి మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు వంశీని చూస్తే, తన సామాజిక వర్గం నుంచి ఒకరు ఎదుగుతున్నాడని, తన సామాజిక వర్గంలో మరొకరు ఎదగడం చంద్రబాబు జీర్ణించుకోలేడని, తనకంటే గ్లామర్‌గా ఉన్నారని, కొడాలి నాని, వంశీ అంటే అందుకే గిట్టదని, దేవినేని అవినాష్ కూడా ఎప్పుడో టార్గెట్ అవుతారని జగన్ చెప్పారు. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు.
సంబంధిత కథనం