భారత్-పాక్ పోరులో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు వెళ్లిన మాజీ సీఎం.. మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మురళి తల్లిదండ్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మురళీ త్యాగం అందరికీ స్పూర్తి అని కొనియాడారు. రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు.
జగన్‌ను చూడగానే మురళీ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. 'మురళీ జగన్ సార్ వచ్చాడ్రా.. సెల్యూట్ కొట్టరా మురళీ' అని అతని తండ్రి విలపించారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరితో కన్నీరు పెట్టించింది. మురళీ తల్లిని జగన్ ఓదార్చారు. ఎప్పుడైనా కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జగన్ వెంట సత్యసాయి జిల్లా వైసీపీ నేతలు పరామర్శకు వెళ్లారు.
జగన్ మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని ఇంటినుంచి బయలుదేరారు. రోడ్డు మార్గాన చిక్కబళ్లాపురం, బాగేపల్లి, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గోరంట్ల మీదుగా 11.30 లకు కళ్లితండా చేరుకున్నారు. అక్కడ 12.30 గంటల వరకు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బెంగళూరు వెళ్లారు. జగన్ కళ్లితండాకు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మే 9న జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో మురళీనాయక్ మరణించారు. మురళీ నాయక్‌కు తల్లి జ్యోతిబాయి, తండ్రి శ్రీరామ్ నాయక్ ఉన్నారు. వారికి మురళీ ఒక్కగానొక్క కుమారుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు మురళీ నాయక్ మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రజలు మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.
జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయన స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో అంత్యక్రియలను నిర్వహించారు. వేలాది మంది ప్రజలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.
సంబంధిత కథనం