'నేను పరామర్శకు వెళ్తే కుట్ర చేయడం భావ్యమా..?' - సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్-ys jagan slams cm chandrababu over podili farmers issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  'నేను పరామర్శకు వెళ్తే కుట్ర చేయడం భావ్యమా..?' - సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

'నేను పరామర్శకు వెళ్తే కుట్ర చేయడం భావ్యమా..?' - సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పొగాకు పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. ఆ రైతులను పరామర్శించడానికి పొదిలికి వెళ్తే… కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ అధినేత జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పొగాకు రైతులకు పరామర్శకు వెళ్తే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.రైతుల సమస్యలను పట్టించుకోకుండా… తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుట్ర చేయడం భావ్యమా..? వైఎస్ జగన్

“పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లాను. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా…? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివచ్చారు. మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి…. వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు” అని విమర్శించారు.

“ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారూ….? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరారు. మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే… అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా..? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ..? రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది” అని వైఎస్ జగన్ ఆక్షేపించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.