'చంద్రబాబు గారు.. ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చిన హామీలేమయ్యాయి..?' - వైఎస్ జగన్ ప్రశ్నలు-ys jagan slams cm chandrababu for betraying govt employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  'చంద్రబాబు గారు.. ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చిన హామీలేమయ్యాయి..?' - వైఎస్ జగన్ ప్రశ్నలు

'చంద్రబాబు గారు.. ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చిన హామీలేమయ్యాయి..?' - వైఎస్ జగన్ ప్రశ్నలు

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి..? ఇప్పుడు చేస్తున్నదేమిటి..? అని ప్రశ్నించారు. ఐఆర్, పీఆర్సీ సంగతి ఏమైందని నిలదీశారు. పేరుకు వారికి హెల్త్‌ కార్డులున్నా వాటివల్ల ప్రయోజనం లేకుండా పోతోందని దుయ్యబట్టారు.

వైసీపీ అధినేత జగన్

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు కావొస్తున్నా… ఒక్క హామీనైనా నెరవేర్చరా అని ప్రశ్నించారు. ఐఆర్, పీఆర్సీ, డీఏలు, అలవెన్సులు ఇలా దేని గురించి కూడా ప్రస్తావించడం లేదంటూ దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ పలు ప్రశ్నలు సంధించారు.

మీ హామీలు ఏమయ్యాయి..? వైఎస్ జగన్ ప్రశ్నలు

  • "చంద్రబాబు గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా…? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది…?
  • చంద్రబాబుగారు… మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా…?
  • మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్‌నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత… IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్‌ని వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు.
  • ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్‌ పేమెంట్స్‌ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్‌. దసరా పండుగకు డీఏలు క్లియర్‌ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కానీ… ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు.
  • CPS/GPSలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కబుర్లు చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూ చేశారా…? మా ప్రభుత్వ హయాంలో CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకోసం GPS తీసుకు వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు.. OPSను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా….. మీలో ఏ మాత్రం చలనం లేదు.
  • ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్‌ డీఏలు, GPF, APGLI, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవ్స్‌ లేదా ఎన్‌క్యాష్ మెంట్‌ లీవులు… వీటి కింద దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో…. వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు.
  • ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడంలేదు.
  • మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. కానీ వారి పొట్టకొట్టి ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తాం అని, వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్‌ క్లినిక్కులూ, పీహెచ్‌సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు.
  • మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్‌ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా…. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
  • ఉద్యోగులకు EHS కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్‌ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా…?
  • చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు" అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం