AP Local Body By Elections 2025 : 'మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా.... కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్' - వైఎస్ జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అధికార పార్టీ ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా…పార్టీ అభ్యర్థులనే గెలిపించుకున్నారని అన్నారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరును ఖండించారు. కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం… అధికార అహంకారం, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా వైసీపీ ప్రజా ప్రతినిధులు భయపడలేదని జగన్ ప్రశంసించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారని గుర్తు చేశారు.
కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్…
“విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్” అంటూ జగన్ ట్వీట్ చేశారు.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత….స్థానిక సంస్థల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడంతో…. ఉప ఎన్నికలు వచ్చాయి. ఇందులో భాగంగానే… గురువారం జిల్లా, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా…. ఆయా చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రత్యేకంగా తరలించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. రాప్తాడుతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కొన్నింటిని వైసీపీ కైవసం చేసుకోగా… మరికొన్ని కూటమిలోని పార్టీలు గెలిచాయి.