AP Arogyasri: ఆరోగ్యశ్రీపై కక్ష ఎందుకు, ఎవరి ప్రయోజనాల కోసం బీమా అని నిలదీసిన వైఎస్‌ జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం..-ys jagan questions why the government is against the aarogyasri scheme ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Arogyasri: ఆరోగ్యశ్రీపై కక్ష ఎందుకు, ఎవరి ప్రయోజనాల కోసం బీమా అని నిలదీసిన వైఎస్‌ జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం..

AP Arogyasri: ఆరోగ్యశ్రీపై కక్ష ఎందుకు, ఎవరి ప్రయోజనాల కోసం బీమా అని నిలదీసిన వైఎస్‌ జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం..

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 08, 2025 06:06 AM IST

AP Arogyasri: బీమా కంపెనీలతో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీపై కక్ష ఎందుకని నిలదీశారు. పేదల సంజీవనికి ఉరి వేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు
సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు

AP Arogyasri: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయిన వేళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆరోగ్య శ్రీ’’ పథకంపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ఎక్స్‌లో ప్రశ్నించారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా వైసీపీ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారు? కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారన్నారు.

yearly horoscope entry point

అధికారంలోకి రాగానే ఒక ప్లాన్‌ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉన్నందునే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు.

17 మెడికల్ కాలేజీలను అమ్మేసే కుట్ర…

ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్య శ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని జగన్ అడిగారు. ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టుపెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదన్నారు. ప్రజల ఆస్తిగా వైయస్సార్‌సీపీ సృష్టించిన 17 మెడికల్‌ కాలేజీలను స్కాం చేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదంటారా? అన్నారు.

ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు కనిపిస్తూనే ఉన్నాయని ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? అని ప్రశ్నించారు. లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం అని ప్రశ్నించారు.

కోవిడ్‌వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమందిని కాపాడుకుందని ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుందన్నారు.

ప్రైవేటు కంపెనీలు ఈ పని చేయగలవా? మీరు చేయించగలరా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా? ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు ఎప్పుడైనా నాణ్యమైన వైద్యం ఇచ్చారా?

చంద్రబాబు నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారని పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అని జగన్ ప్రశ్నించారు. వైయస్సార్‌ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక్కపనైనా చేశారా అని నిలదీశారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1,000 నుంచి 3,257కి పెంచిందని మేనిఫెస్టోలో వాగ్దానంచేసినట్టు సంవత్సరాదాయం రూ.5లక్షలలోపు ఉన్నవారికి కూడా వర్తింపచేసి మధ్యతరగతివారికీ మేలు చేశామన్నారు.

రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేశాం. ఐదేళ్లకాలంలో 45.1లక్షల మందికి రూ.13,421 కోట్లు ఖర్చుచేసి ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంటుకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి, దానికింద మరో రూ.1,465 కోట్లు అందించి రూ. 24.59 లక్షల మందికి ఆరోగ్య ఆసరాగా నిలిచామన్నారు. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారని కొత్తగా అంబులెన్స్‌లు తీసుకు వచ్చి 104,108 సేవలను మేం మెరుగుపరిస్తే, మీరు నెలల తరబడి బకాయిలుపెట్టి ఆ అంబులెన్స్‌ సేవలను సైతం నిర్వీర్యం చేశారని ఆరోపించారు.ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నాను.

Whats_app_banner

సంబంధిత కథనం