Vinukonda Murder : రషీద్ హత్యపై వైసీపీ సీరియస్ - శుక్రవారం వినుకొండకు వైఎస్ జగన్-ys jagan mohan reddy will visit vinukonda tomorrow to console rasheed family ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vinukonda Murder : రషీద్ హత్యపై వైసీపీ సీరియస్ - శుక్రవారం వినుకొండకు వైఎస్ జగన్

Vinukonda Murder : రషీద్ హత్యపై వైసీపీ సీరియస్ - శుక్రవారం వినుకొండకు వైఎస్ జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 18, 2024 08:59 PM IST

Vinukonda Murder : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం(రేపు) వినుకొండకు రానున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్
గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్

Vinukonda Murder Case:వినుకొండలో బుధవారం రాత్రి రషీద్‌ అనే యువకుడిని జిలానీ అనే యువకుడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. తమ పార్టీ కార్యకర్తను టీడీపీ నేతలు దారుణంగా చంపారని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు, విమర్శలను టీడీపీ కొట్టిపారేస్తోంది.

రషీద్ హత్యతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని అంటోంది. ఒకే పార్టీకి చెందిన వారి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగిందని, ఇందులో రాజకీయ కోణం లేదని టీడీపీ చెబుతోంది.

వినుకొండలో జరిగిన హత్య నేపథ్యంలో బెంగుళూరు పర్యటనలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పర్యటను అర్థాంతరంగా ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. సాయంత్రం విజయవాడకు చేరుకున్న ఆయన… రేపు వినుకొండకు రానున్నారు.

వినుకొండకు జగన్

శుక్రవారం వైఎస్ జగన్ వినుకొండకు చేరుకోనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి... మధ్యాహ్నం 12. 30 గంటలకు వినుకొండకు చేరుకుంటారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1 తర్వాత... రోడ్డు మార్గంలోనే తాడేపల్లికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 03. 30 గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు.

ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై వైఎస్ జగన్ ఉదయం ట్వీట్ చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. - ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, - వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్టఅని ట్వీట్‌లో పేర్కొన్నారు.

నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని, సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని జగన్ ఆక్షేపించారు.

నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకి విజ్క్షప్తి చేస్తున్నానన్నారు.

వినుకొండలో యువకుడి హత్య నేపథ్యంలో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ హత్యకు టీడీపీనే కారణమని వైసీపీ అంటుంటే…. తమకు ఈ హత్యతో సంబంధం లేదని టీడీపీ చెబుతోంది. మరోవైపు వైఎస్ జగన్…. రేపు వినుకొండలో పర్యటించనున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.