మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుంది...? వైఎస్ జగన్-ys jagan launches anti privatisation campaign visted narsipatnam medical college ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుంది...? వైఎస్ జగన్

మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుంది...? వైఎస్ జగన్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుందని నిలదీశారు.

నర్సీపట్నం పర్యటనలో వైఎస్ జగన్

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుంది.? అని ప్రశ్నించారు.నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేపట్టామని చెప్పారు. 2022, డిసెంబర్‌ 30న శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. కొవిడ్ పరిస్థితులను అధిగమించి రూ. 500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశామన్నారు. ఈ కాలేజీ పూర్తి అయి ఉంటే పరిస్థితులు మారేవి. పక్కనే ఉన్న పార్వతీపురం మెడికల్ కాలేజీ పూర్తయి ఉంటే….అస్వస్థతకు గురైన గిరిజన విద్యార్థులకు వైద్యం అందించే వారు కదా అని నిలదీశారు.

అసలు ఆధునిక దేవాలయాలైన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పేదవారు దగపడకుండా ఎలా ఆపుతారని నిలదీశారు. ప్రైవేటు వాళ్లు అధిక ఛార్జీలు వేస్తే పేదవాళ్లు ఎలా తట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నర్సీపట్నంకి చెందిన అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఉన్నా.. అబద్ధాలు చెబుతున్నారు. మెడికల్ కాలేజీకి జీవో లేదు అంటారా? ఇదిగో జీవో నెంబరు 204. జీవో లేదంటూ అబద్ధాలు చెప్పిన మీరు స్పీకర్‌ పదవికి అర్హుడివా అయ్యన్న…?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) కింద అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ… కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ సందర్శించారు.

వైఎస్ జగన్…. విజయవాడ నుంచి ప్రైవేట్ జెట్ లో వైజాగ్ చేరుకుని రోడ్డు మార్గంలో మెడికల్ కాలేజీకి వెళ్లారు. అయితే భారీ వర్షం ఉన్నప్పటికీ… జగన్ పర్యటన అలాగే కొనసాగుతోంది. వైసీపీ మద్దతుదారులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ఉద్యోగులతో సహా పలువురు జగన్ కు వినతిపత్రాలను ఇచ్చారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి… తమను మోసం చేస్తోందని చెప్పారు. తమ తరపున పోరాటం చేయాలని కోరారు.కార్మికుల విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్నదే అని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి.

 

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం