రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని.. కేసులకు, జైళ్లకూ భయపడకూడదని నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని.. అలా అయితేనే నాయకులుగా ఎదుగుతామని చెప్పారు.
'మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16 స్థానాలు వచ్చాయి. టీడీపీ వాళ్లని లాక్కుందామని మన ఎమ్మెల్యే అడిగాడు. కానీ మన పార్టీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయించాం. తాడిపత్రిలో ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరిగేలా చూశాం. కాబట్టే తాడిపత్రిలో టీడీపీ గెలిచింది' అని జగన్ వివరించారు.
'సంఖ్యాబలం లేని తిరువూరులో కూడా పోటీకి దిగారు. వైఎస్సార్సీపీకి మెజార్టీ ఉండటంతోనే ఎన్నిక ఆపుతున్నారు. మన నేతలను అరెస్టు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులను రోడ్డుపై విడిచిపెడుతున్నారు. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడలేదు. చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం. జగనన్నకు చెబుదాం నంబర్ కు ఫోన్ చేస్తే.. వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన ద్వారా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్ల సమస్యలకే పరిష్కారాలు చూపాం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.
'క్షేత్రస్థాయిలో మన పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెట్టిన ఎవ్వరినీ వదిలబోం. అందర్ని పేర్లు రాసిపెట్టండి. కచ్చితంగా వాళ్లకు సినిమా చూపిస్తాం. అది కూడా మామూలుగా ఉండదు. ఈసారి వేరే లెవల్‌లో ఉంటుంది. కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటా. ఇప్పుడు కేసులకు, జైళ్లకు భయపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదు. కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తరఫున నిలదీయాలి' అని జగన్ సూచించారు.
'బాబు దుర్మార్గపు పాలనతో చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది. మహిళలని చూడకుండా జైళ్లలో పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే.. మరో కేసు పెడుతున్నారు. వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు. దళితుడు నందిగం సురేష్ విషయంలోనూ ఇదే పరిస్థితి' అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'బాబు నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మర్చిపోవద్దు. రాబోయే రోజుల్లో ప్రజల తరపున గట్టిగా పోరాటాలు చేద్దాం. వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నా.. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. కొడతానంటే.. కొట్టమనండి.. కానీ బుక్‌లో పేర్లు రాసుకోండి. రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం. అన్యాయాలు చేసిన వారి సినిమా చూపిస్తాం' అని జగన్ వార్నింగ్ ఇచ్చారు.
సంబంధిత కథనం