YS Jagan : టార్గెట్ టీడీపీ.. పక్కా ప్లాన్‌తో జగన్.. జిల్లాల పర్యటనతో ఏం జరగబోతోంది?
YS Jagan : ప్రస్తుతం జగన్ రాజకీయ ప్రత్యర్థులు బలంగా ఉన్నారు. ఫలితంగా వైఎస్సార్సీపీ బలహినంగా మారుతోంది. అనేకమంది నాయకులు పార్టీని వీడారు. ఇంకా ఎంతమంది గుడ్ బై చెబుతారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం కష్టం. అందుకే జగన్ పక్కా ప్లాన్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారనే టాక్ ఉంది.
ఏ పార్టీకైనా జెండా మోసే కార్యకర్తలే బలం. ముఖ్యంగా వైసీపీకి, జగన్‌కు కార్యకర్తల సపోర్ట్ లేకుంటే.. 2019లో ఆ స్థాయిలో విజయం వచ్చేది కాదు. కార్యకర్తల సపోర్ట్ అలాగే ఉంటే.. 2024 ఎన్నికల్లోనూ జగన్ మళ్లీ విజయం సాధించేవారు. కానీ.. జెండా మోసే కార్యకర్త పార్టీకి దూరమయ్యాడు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడింది. దీంతో జగన్‌కు అసలు విషయం అర్థమైంది.

కార్యకర్తలకు దూరంగా..
2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాన్నే ప్రజల ఇళ్లకు పంపారనే టాక్ ఉంది. ప్రజలకు మంచి చేస్తే వాళ్లే ఓట్లేసి గెలిపిస్తారని జగన్ బలంగా నమ్మారు. కానీ.. 2024 ఎన్నికల్లో అది జరగలేదు. కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా సీట్లు రాలేదు. దీంతో అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లోకి పార్టీ వెళ్లిపోయింది.
పోలింగ్ బూత్‌కు తీసుకురావాలిగా..
ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిస్థితులు, జగన్ జిల్లాల పర్యటనపై 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ఏలూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతతో మాట్లాడింది. అప్పుడు ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'జగన్ ఎంతసేపూ ప్రజలకు పథకాలు ఇస్తున్నాం.. మంచి చేస్తున్నాం.. వాళ్లే మనకు ఓట్లేసి గెలిపిస్తారు. మన అవసరం ప్రజలకు ఉంది.. అని భావించేవారు. నిజంగా జగన్ ప్రజలకు మంచే చేశారు. కానీ.. ఎన్నికలప్పుడు ఆ ప్రజలను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించేది కార్యకర్తలే. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించాం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది' అని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు.
'మాతో జగన్ సమీక్షలు చేసినప్పుడు అనేక విషయాలు చెప్పేవారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించేవారు. కానీ.. నాయకులు కాదు.. పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లాలి. ఆ విషయాన్ని ఎవరూ జగన్‌కు చెప్పే ధైర్యం చేయలేదు. లోపం నాయకుల్లో కూడా ఉంది. అన్ని విషయాలు పార్టీ అధినేత చూసుకోవడం కష్టం. ఎవరి నియోజకవర్గాల్లో వారు కార్యకర్తలను కాపాడుకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. జగన్ కూడా మేమందరం కార్యకర్తలకు అండగానే ఉంటున్నాం అనుకున్నారు. కానీ.. అన్నిచోట్ల అది జరగలేదు. దీంతో కార్యకర్తలు దూరమయ్యారు' ఆ నేత స్పష్టం చేశారు.
'పార్టీకి కేడర్ బలం. అందుకే జగన్ మళ్లీ కార్యకర్తలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. లోకల్ లీడర్లపై కార్యకర్తలు కోపంగా ఉన్నా.. జగన్‌ను చూస్తే ఆ కోపం పోతుంది. అటు ఎందరో పార్టీని వీడారు. అయినా కేడర్ అలాగే ఉంది. వారిని కాపాడుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం జగన్ వల్లే అవుతుంది. ఆ విషయాన్ని గ్రహించే జగన్ జిల్లాల పర్యటనకు ప్లాన్ చేశారని అనుకుంటున్నాం. అనేక నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ సైలెంట్‌గా ఉంది. జగన్ రంగంలోకి వస్తే.. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది' అని వైసీపీ సీనియర్ నేత చెప్పారు.
యువరక్తం..
వైసీపీకి ప్రస్తుతం యువరక్తం కావాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఇప్పుడు పార్టీలో ఉన్న యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి, కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరికొంతమంది మాస్ లీడర్లను కూడా గట్టిగా జనాల్లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. టీడీపీని ఎదుర్కోవాలంటే సీనియర్ నాయకుల కంటే.. యువ నాయకులే కీలకం అని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే త్వరలో కొందరికి కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అటు చాలామంది నేతలు తమతమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. జగన్ కూడా వారిని ప్రోత్సహించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి జగన్ రంగంలోకి దిగాక.. జనవరి నుంచి ఏపీ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం కనిపిస్తోంది.