YS Jagan: సుప్రీం కోర్టులో వైఎస్‌ జగన్‌కు ఊరట… బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్లు ఉపసంహరణ-ys jagan got relief in supreme court from bail cancellation pils ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan: సుప్రీం కోర్టులో వైఎస్‌ జగన్‌కు ఊరట… బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్లు ఉపసంహరణ

YS Jagan: సుప్రీం కోర్టులో వైఎస్‌ జగన్‌కు ఊరట… బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్లు ఉపసంహరణ

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 27, 2025 11:49 AM IST

YS Jagan: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. బెయిల్‌ నిబంధనల ఉల్లంఘన జరగకపోవడంతో జగన్ బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేయాలో, ఉపసంహరించుకుంటారో తేల్చుకోవాలని న్యాయమూర్తి సూచించడంతో పిటిషనర్‌ వాటిని ఉపసంహరించుకున్నారు.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు (HT_PRINT)

YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను పిటిషనర్‌ ఉపసంహరించుకున్నారు. బెయిల్‌ రద్దు చేయడానికి సహేతుకమైన కారణాలను వివరించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.  జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ మాజీ ఎంపీ రఘు రామకృష్ణం రాజు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిపై నమోదైన కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వివరించే ప్రయత్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రికి బెయిల్‌ మంజూరైన తర్వాత విచారణకు హాజరు కావడం లేదని, కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని, మొత్తం విచారణకు ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేసుల విచారణ స్థితిని న్యాయమూర్తి ప్రశ్నించారు. 

మరోవైపు జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని ప్రతివాదులు సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వారం కేసు విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.  కేసు విచారణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో పిల్ దాఖలు చేసినట్టు పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ వివాదాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలని పిటిషనర్‌ కోరారు. హైకోర్టులో కేసుల విచారణ జరుగుతున్న దశలో ఈ  వివాదం పరిధిలోకి తాము జోక్యం చేసుకోవడం సరికాదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

ఇప్పటికే విచారణ జరుగుతుండగా హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం, దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్‌ డిస్మిస్ చేయాలా? ఉపసంహరించుకుంటారా? అని న్యాయమూర్తి ప్రశ్నించడంతో పిటిషనర్ పిల్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పడంతో వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించారు.

Whats_app_banner