YS Jagan On Tirumala stampede : తొక్కిసలాటకు చంద్రబాబు సహా వారంతా బాధ్యులే - వైఎస్ జగన్
తిరుపతిలో జరిగిన ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. బాధితులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదని విమర్శించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన…. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. తిరుపతిలో జరిగిన ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదని విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని దుయ్యబట్టారు.
అబద్ధాలు చెబుతున్నారు - వైఎస్ జగన్
“గత ఐదేళ్లు గొప్పగా నిర్వహించాం.. ఒకచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. విష్ణునివాసంలో ఒకరు చనిపోయారని ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. బైరాగిపట్టెడలో ఐదుగురు చనిపోయారని ఎఫ్ఐఆర్ లో ఉంది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారు. స్విమ్స్‌లో 35 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 50 నుంచి 60 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థను నడుపుతున్నారు. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఎవరూ పట్టించుకోలేదు” అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారంతా బాధ్యులే….
“రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఈ ఘటన జరగలేదు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, ఈవో, ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే. బాధితులకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించటంతో పాటు రూ. 5 లక్షల సాయం ప్రకటించాలి. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీటీడీ ముఖ్య అధికారులు బాధ్యత తీసుకోవాలి” అని జగన్ డిమాండ్ చేశారు.
“ఈ మరణాలకు కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. నమోదైన కేసుల్లో కూడా సంబంధం లేని సెక్షన్లు పెట్టారు. కేసును నీరు గార్చేలా సెక్షన్లు విధించారు. కనీసం చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గతంలో లడ్డూ విషయంలో అనేక అబద్ధాలను చెప్పి తిరుమల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారు” అని వైఎస్ జగన్ విమర్శించారు.
“ఇంత జరిగినా, సీఎం చంద్రబాబు పద్ధతి లేకుండా మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్ కూడా తప్పులతడకగా నమోదు చేశారు. ఇది సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అయినా టీటీడీ బాధ్యతారహితంగా వ్యవహరించింది. తిరుపతికి లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా, వారికి ఏ విధంగా వసతులు కల్పించాలి? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు కానీ, టీటీడీ ఛైర్మన్ కానీ ఆలోచించలేదు. ఘటనపై బీఎన్‌ఎస్ 194 సెక్షన్ పెట్టారు. అది పూర్తిగా తప్పు. సెక్షన్ 105 నమోదు చేయాలి. చంద్రబాబు సీఎం అయ్యాక, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తింటోంది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఎంతో పేరుంది. కానీ ఈరోజు తిరుమలకు రావాలంటే, భయపడే పరిస్థితి వచ్చింది” అని జగన్ కామెంట్స్ చేశారు.