రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది - వైఎస్ జగన్-ys jagan criticizes government for running red book constitution in the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది - వైఎస్ జగన్

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది - వైఎస్ జగన్

రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. తెనాలి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇవాళ జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్ (YSRCP)

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వ్యవస్థలు అదుపు తప్పిపోతే.. పోలీసు వ్యవస్థ ఎలా దిగ జారి పోతుందో చెప్పడానికి తెనాలి ఘటన నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

రేపు నిరసనలకు పిలుపు…

రెడ్‌ బుక్‌ పాలనకు వ్యతిరేకంగా బుధవారం వెన్నుపోటు దినోత్సవంగా నిరసనలకు పిలుపునిచ్చారు. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘనలు పరిశీలిస్తే, చంద్రబాబు, టీడీపీ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని తెచ్చి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెనాలి ఘటనే నిదర్శనం - వైఎస్ జగన్

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యంగానికి ఉపయోగపడుతూ పోలీస్‌ వ్యవస్థ అదుపు తప్పి పోయిందని జగన్ విమర్శించారు. దానికి తెనాలి ఘటన నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని…. తెనాలి ఘటన ఎందుకు అన్యాయమైన ఘటనో అంతా తెలుసుకోవాలన్నారు.

పోలీసులు రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని జగన్ పునరుద్ఘాటించారు. సీఐలు, డిఎస్పీలను ప్రభుత్వం కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటుందని… ఎమ్మెల్యేలు దగ్గరుండి పోలీసులతో మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నియోజక వర్గంలో మామూళ్లు వసూలు చేస్తున్నారని… పర్మిట్‌ రూమ్‌, బెల్ట్‌ షాప్‌లకు డబ్బులు వసూలు చేసి చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు చెల్లిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇసుక, క్వార్ట్జ్‌, లాటరైట్‌ దోపిడీ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ ఉందా అని ప్రశ్నించారు.

కేసులు ఉన్న ప్రతి వారు ముద్దాయిలు కాలేరని… వారి కుటుంబాల పరువు తీసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. రాకేష్‌ చెల్లెలు ఇంజనీరింగ్ పూర్తి చేశారని, వారి కుటుంబ పరువు తీశారని, విక్టర్‌ తండ్రి ప్రజాశక్తిలో విలేకరిగా పని చేస్తున్నాడని చెప్పారు. తెనాలిలో నివాసం ఉండని రాకేష్‌ను కేసులో ఇరికించారని జగన్‌ ఆరోపించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం