MLC Botcha LOP : అదృష్టమంటే బొత్సదే..! మండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశం, వైఎస్ జగన్ నిర్ణయం
ఇటీవలే ఎమ్మెల్సీగా విజయం సాధించిన బొత్సకు ఆ పార్టీ అధినేత జగన్ మరో అవకాశం కల్పించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన్ను నియమించారు. ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బొత్సకు… ఎమ్మెల్సీ రూపంలో మరో అవకాశం దక్కినట్లు అయింది. అయితే పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన ఆయనకు… పార్టీ అధినేత జగన్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణను శాసనమండలిలో ప్రతిపక్షనేతగా నియమించారు.
బొత్సను మండలిలో ప్రతిపక్ష నేతగా నియమిస్తున్నట్లు పేర్కొంటూ శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. అలాగే మండలిలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.
కొద్దిరోజుల కిందటనే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేరును శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా జగన్ ప్రకటించారు. అయితే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్సను అభ్యర్థిగా ప్రకటించటంతో సీన్ మారిపోయింది. బొత్స విజయం సాధించటంతో ప్రతిపక్ష నేత పదవిని బొత్సకు కట్టబెట్టాలని జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి రాజీనామా చేయటంతో మండలిలో బొత్స ప్రతిపక్ష నేతగా వ్యవహారించనున్నారు.
ఏకగీవ్రంగా ఎన్నిక…!
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించటంతో పాటు నామినేషన్ వేసిన మరో అభ్యర్థి కూడా విత్ డ్రా అయ్యారు. ఫలితంగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. దీంతో పోటీ లేకుండా బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఎమ్మెల్సీ సీటను వైసీపీ అత్యంత సవాల్ గా తీసుకుంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే…. అధికారం కోల్పోయిన తరువాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులను అలర్ట్ చేసింది.
స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ నేరుగా రంగంలోకి దిగి… నేతలతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాతే సీనియర్ నేతగా ఉన్న బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావించడంతో వైసీపీ గెలుపు నల్లేరు మీదగా మారిపోయింది. కూటమి దూరంగా ఉండటంతో పాటు స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.
బొత్స సత్యనారాయణ విజయంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నింపినట్లు అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో పూర్తిగా డీలా పడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి… ఈ విజయం కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు…! మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స రాణిస్తారనే విశ్వాసం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.