Delimitation Politics : డీలిమిటేషన్‌పై స్పందించిన జగన్, షర్మిల.. మోదీకి లేఖ రాసిన వైసీపీ చీఫ్
Delimitation Politics : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్, షర్మిల దీనిపై స్పందించారు. జగన్ పీఎం మోదీకి లేఖ రాశారు. 2026 డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
జనాభా నియంత్రణపై కేంద్ర నిబంధనలను దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా పాటించాయని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కారణం దక్షిణాది రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోందని, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు కచ్చితంగా తగ్గుతాయని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ప్రాతినిధ్యం తగ్గొద్దు..
జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని ప్రధానమంత్రికి సూచించారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలన్నారు జగన్. లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా.. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని తన లేఖలో కోరారు. పార్లమెంటులో సమాన భాగస్వామ్యం కోసం రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించకుండా డీలిమిటేషన్ చేపట్టాలని ప్రధానిని కోరారు.
షర్మిల ఫైర్..
'డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదు. ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి.. సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పనిలేకుండా పోతుంది. సొమ్ము సౌత్ ది..సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదు. డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదు' అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
ఇది కాదా అన్యాయం..
'కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే.. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144. ఇది కాదా వివక్ష చూపడం అంటే? యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే.. సౌత్ మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితం. ఇది కాదా దక్షిణ భారతంకి జరిగే అన్యాయం?' అని షర్మిల ప్రశ్నించారు.
అందరూ కలిసి రావాలి..
'డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా ఫలితం ఉండదు. ఏపీలో మోదీ పక్షం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే. ప్రజల హక్కులను కాలరాసినట్లే. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం నోరు విప్పకపోవడం మోడీకి పరోక్ష మద్దతు అని ఒప్పుకున్నట్లే. డీలిమిటేషన్‌పై రాజకీయాలు పక్కన పెట్టీ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ముందుకు రావాలి' అని షర్మిల పిలుపునిచ్చారు.