YS Viveka Murder Case : వివేకా హత్య కేసు.. అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి నాలుగోసారి సీబీఐ విచారణ ముగిసింది. నాలుగు గంటలపాటు అవినాశ్ రెడ్డిని విచారించారు అధికారులు.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి(YS Avinash Reddy) సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్‌కు వెళ్లిన అవినాశ్‌రెడ్డిని సుమారు నాలుగు గంటపాటు అధికారులు ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలో అవినాశ్‌రెడ్డిని సీబీఐ(CBI) విచారణ చేసింది.
వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ నాలుగు గంటలపాటు విచారణ చేసింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో సీబీఐ(CBI) కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 10వ తేదీన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సైతం హాజరయ్యారు అవినాశ్ రెడ్డి. ఇవాళ సీబీఐ ఎదుట హాజరుకావడం నాలుగోసారి.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో దిల్లీ వెళ్లాల్లి ఉందని, సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు(High Court)లో విచారణ సందర్భంగా.. సీబీఐ ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరారు. అయితే తాము జోక్యం చేసుకోలేమని, సీబీఐ వద్దే తేల్చుకోవాలని న్యాయస్థానం చెప్పింది.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టుని గతంలో ఆశ్రయించగా.. సోమవారం (మార్చి 13) వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. తదుపరి విచారణపైనా స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తూ నిర్ణయం వెలువరించింది. తీర్పు వెల్లడించే వరకు అవినాశ్ ని అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సీబీఐని ఆదేశించింది.
సీబీఐ విచారణ ఏకపక్షంగా సాగుతోందని.. విచారణ సందర్భంగా వీడియో రికార్డింగ్ చేస్తున్నారో లేదో తెలియడం లేదని అవినాశ్ రెడ్డి(Avinash Reddy) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన తరపు న్యాయవాది సైతం కోర్టులో ఇవే వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో విచారణలో ఈ అంశంపై సీబీఐ తరపు న్యాయవాదులు స్పష్టత ఇచ్చారు. అవినాశ్ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేస్తున్నామని కోర్టుకి తెలిపారు. అలాగే.. కేసులో అవినాశ్ రెడ్డికి పాత్రకు సంబంధించిన వివరాలను హైకోర్టుకి సీల్డ్ కవర్ లో అందించింది సీబీఐ. 10 డాక్యుమెంట్లు, 35 వాంగ్మూలాలు, కొన్ని ఫోటోలు సమర్పించింది.
సంబంధిత కథనం