AP Constable Selection: ఉద్యోగ పరుగులో యువకుడి ఊపిరి ఆవిరి...ఒక్కగాని ఒక్క కొడుకు మృతితో తల్లడిల్లిన తల్లి
AP Constable Selection: ఉద్యోగ పరుగులో యువకుడి ఊపిరి ఆవిరి అయింది. ఒక్కగాని ఒక్క కొడుకు మృతితో తల్లి పేగు తల్లడిల్లిపోయింది. తనకు దిక్కెవరంటూ రోదించింది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా 1,600 రన్నింగ్‌లో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
AP Constable Selection: ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నిర్వహిస్తున్న శారీరక సామర‌్థ్య పరీక్షల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జ్వరంతో బాధపడుతూనే ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న యువకుడు అనూహ్యంగా మృతి చెందడం కుటుంబాన్ని విషాదంలో నింపింది.
ఎన్‌టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (25) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివిచింది. చంద్రశేఖరరావు ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో ఈ దేహదారుఢ్య పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం జరిగిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు.
ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్‌లో మూడు రౌండులు పూర్తి చేసిన చంద్రశేఖరరావు నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఉన్నాడు. అయితే అంతలోనే ఒక్కసారిగా అస్వస్తతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నా పోలీసు అధికారులు చంద్రశేఖరరావుని పక్కకు తప్పించి, అక్కడే ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే చంద్రశేఖరరావు మృతి చెందారు. కార్డియాటిక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న తల్లి ఆసుపత్రికి చేరుకుని రోదించింది. అక్కడ విగతజీవిగా కనిపించిన కుమారుడిని చూసి తల్లడిల్లిపోయింది. నాకింక దిక్కెవరయ్యా అంటూ బోరున విలపించింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
మృతుడి బంధువల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం చేసిన తరువాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. ఈ ఘటనతో జీలగొండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం వేటలో తమ స్నేహితుడి మృతి చెందడాన్ని చంద్రశేఖరరావు స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఆయన గత ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన కాల్ లెటర్‌లో ఉన్న తేదీ ఆధారంగా గురువారం దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఘటనతో శుభవార్తతో ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తీరని సోకం మిగిలింది. అయితే ఈ ఘటనతో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, చివరి రోజైనా దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావచ్చని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని, అనారోగ్యం కారణంగా పాల్గొనకలేకపోతే చివరి రోజు జనవరి 20 తేదీన హజరయ్యేందుకు అనుమతి పొందవచ్చని అన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)