Prakasam District Tragedy : ప్రేమించి మోసగించిందంటూ యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు చేసిన పోలీసులు
Prakasam District Tragedy : ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువతి, ఆమె పేరెంట్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా నాగులుప్పడుపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో విషాదం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో సహయంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్‌కు పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
అమెరికా వెళ్తానని..
దీంతో ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో కొద్దికాలం పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరింది. ప్రవీణ్ తనకున్న పరిచయాలను ఉపయోగించి అందినకాడికి డబ్బులు తెచ్చి.. హరిణి లక్ష్మికి ఇచ్చాడు. ఇలా ఏడాదిన్నర కిందట హరిణి లక్ష్మిని అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత కొత్త అలవాట్లు, కొత్త స్నేహితులు, కొత్త ప్రపంచంలోకి వెళ్లింది. ప్రవీణ్‌తో సరిగా మాట్లాడేది కాదు. తొలిత బాగానే ఉన్నా.. ఆ తరువాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.
నువ్వంటే ఇష్టం లేదని..
దాన్ని ప్రవీణ్ పసిగట్టలేదు. అయితే ఒక రోజు ఆమె స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి సడన్‌గా ప్రవీణ్‌కు ఫోన్ చేసింది. నువ్వంటే ఇష్టం లేదని, తనను మరిచిపో అంటూ చెప్పింది. ప్రవీణ్ ఎంత చెప్పినా ఆమె వినలేదు. పైగా తన కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రవీన్‌తో పాటు ఆయన తండ్రి కందుల డానియేలును కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
డబ్బులు డిమాండ్..
ఆ తరువాత ఎవరి మట్టుకు వారున్నారు. అయితే ఇటీవల హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి మళ్లీ ప్రవీణ్‌కు ఫోన్ చేశారు. డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంపించకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. ప్రేమించిన అమ్మాయి ఇలా బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. తాను పడుతున్న మనో వేదనను హరిణి లక్ష్మికి చెప్పి.. బుధవారం రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యువతిపై కేసు..
గురువారం మధ్యాహ్నం మృతుడు ప్రవీణ్ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ప్రవీణ్ తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అజయ్ బాబు వెల్లడించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)