Vijayawada: బిర్యానీ విషయంలో గొడవ.. అన్నను చంపిన తమ్ముడు-younger brother killed his elder brother in a fight for biryani in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada: బిర్యానీ విషయంలో గొడవ.. అన్నను చంపిన తమ్ముడు

Vijayawada: బిర్యానీ విషయంలో గొడవ.. అన్నను చంపిన తమ్ముడు

Basani Shiva Kumar HT Telugu
Aug 27, 2024 05:42 AM IST

Vijayawada: విజయవాడలో దారుణ ఘటన జరిగింది. బిర్యానీ కోసం జరిగిన గొడవ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. వంద రూపాయలు పెడితే వచ్చే బిర్యానీ కోసం.. రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యనే చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన విజయవాడలో సంచలనంగా మారింది.

బిర్యానీ విషయంలో గొడవ.. అన్నను చంపిన తమ్ముడు
బిర్యానీ విషయంలో గొడవ.. అన్నను చంపిన తమ్ముడు (X)

చిన్న చిన్న విషయాల్లో జరిగే గొడవలు.. హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో అన్ని మర్చిపోయి దాడులు చేసుకుంటున్నారు. తాజాగా.. విజయవాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వంద రూపాయలు పెడి వచ్చే బిర్యానీ కోసం అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈ గొడవలో తమ్ముడు అన్నపై దాడి చేయగా.. అన్న మృతిచెందాడు. తమ్ముడు కటకటాలపాలయ్యాడు.

తన భార్యకు బిర్యానీ కావాలని..

విజయవాడ నగరం గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము.. గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరికి పెళ్లి అయ్యింది. సమవారం ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి.. తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని.. ఇప్పించమని అడిగాడు. బిర్యానీ విషయంలో లక్ష్మారెడ్డి, రాము మధ్య గొడవ జరిగింది.

ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు..

గొడవ పెద్దది కావడంతో.. తమ్ముడు లక్ష్మారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కిటికీ కర్రతో అన్న రాముపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు గొడవ జరిగిన ప్రదేశానికి వచ్చారు. తమ్ముడు లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. బిర్యానీ కోసమే చంపాడా.. వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

దుండిగల్‌లో ఛార్జర్ కోసం..

హైదరాబాద్ సమీపంలో దుండిగల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే అక్కడ ఛార్జర్ కోసం చపేశారు. దుండిగల్‌లో శాంత అనే మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. అక్కడికి కమల్ కుమార్ అనే యువకుడు వచ్చాడు. శాంతను సెల్ ఫోన్ ఛార్జర్ అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో గొడవ జరిగింది. దీంతో కమల్ కుమార్ కోపంతో ఊగిపోయాడు. శాంత అరవకుండా నోరు మూసేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కమల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మధురానగర్‌లో..

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దొంగతనం చేశాడన్న కారణంలో ఓ యువకుడిని పండ్ల వ్యాపారి యువకుడ్ని చంపేశాడు. తన షాపులోకి దొంగతనం చేసేందుకు వచ్చినప్పుడు ఇనుపరాడుతో దాడికి దిగాడు. విచక్షణారహితంగా కొట్టడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తి పలుమార్లు ఇదే షాపులో దొంగతనం చేసినట్లు తెలిస్తోంది. గల్లా పెట్టెలో ఉన్న డబ్బులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తల్లి గొంతు కోసి..

తెలంగాణలోని నల్గొండ జిల్లాలోను ఇటీవల దారుణం జరిగింది. నిడమనూరు మండల కేంద్రంలో కన్నతల్లిని గొంతుకోసి కొడుకు హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తిలో గొంతు కోసుకొని బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఏడాది కిందట శివ (36)కు వివాహమైంది. ఇటీవలనే భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయితే.. శివ మానసికస్థితి సరిగా లేదని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిని చంపి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని చెబుతున్నారు.