Snake bite : పాముతో సెల్ఫీకి ప్రయత్నం … కాటేయడంతో యువకుడి మృతి…-young man killed with snake bite who tried to take selfie photos and videos with it ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Young Man Killed With Snake Bite Who Tried To Take Selfie Photos And Videos With It

Snake bite : పాముతో సెల్ఫీకి ప్రయత్నం … కాటేయడంతో యువకుడి మృతి…

HT Telugu Desk HT Telugu
Jan 26, 2023 06:46 AM IST

Snake bite పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ సరదాతో ప్రాణాలు పోగొట్టుకునాడు. తాళ్లూరుకు చెందిన మణకంఠ రెడ్డి అనే యువకుడు కందుకూరులో జ్యూస్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. పాములు ఆడించే వ్యక్తి దగ్గర ఉన్న పాముతో సెల్ఫీ తీసుకోడానికి మెడలో వేసుకున్నాడు. పామును కిందికి దించుతున్న సమయంలో అది చేతిపై కాటు వేసింది. దీంతో స్థానికులు యువకుడిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మణికంఠ చనిపోయాడు.

పాము కాటుతో  మృతి చెందిన మణికంఠ రెడ్డి
పాము కాటుతో మృతి చెందిన మణికంఠ రెడ్డి

Snake bite విష సర్పంతో సెల్ఫీకు ప్రయత్నించిన యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. రోడ్డుపై పాములను ఆడించే వ్యక్తి దగ్గర్నుంచి పామును తీసుకుని మెడలో వేసుకున్న యువకుడిని అది కాటేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు మణికంఠారెడ్డి. డిగ్రీ చదివి, కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ లస్సీ దుకాణం దగ్గరకు వచ్చాడు. దుకాణంలో ఉన్న మణికంఠ రెడ్డి పామును మెడలో వేసుకుని ఫొటో తీయించుకోవాలని భావించాడు. పక్కనే మరో దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచి తన సెల్‌ఫోన్‌ను అతనికిచ్చాడు. పామును మెడలో వేసుకున్న తర్వాత ఫొటోలు, వీడియోలు తీయాలని చెప్పాడు.

ఫోటోలు తీస్తుండగా మెడలో వేసుకున్న పాము కింద పడింది. దాన్ని పైకి లాగేందుకు ప్రయత్నించడంతో అది వేగంగా మణికంఠ చేతిపై కాటేసింది. పాము కాటు వేయడం గుర్తించి స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మణికంఠ పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలులోని రిమ్స్‌కు పంపారు.

ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందినట్లు రిమ్స్‌ వైద్యులు తెలిపారు. బంధువులు మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి బొద్దికూరపాడుకు తరలించారు. కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో, ఫోన్‌లో ఉన్న ఫొటోలు చూస్తే తల్లిదండ్రులు మందలిస్తారని వాటిని డిలీట్‌ చేయించాడని మిత్రులు చెబుతున్నారు. చేతికి అందొచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.

రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల చిన్న కుమారుడు ఇంద్రారెడ్డి ఐదేళ్ల కిందట కిడ్నీ సమస్యతో చనిపోయాడని బంధువులు తెలిపారు. మణికంఠ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పామును ఆడిస్తున్న వెంకటస్వామిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.

IPL_Entry_Point

టాపిక్