Vizianagaram : విజయనగరంలో జిల్లాలో ఘోరం.. వివాహేతర సంబంధం అనుమానం.. యువ ఇంజనీర్ హతం!
Vizianagaram : విజయనగరంలో జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం అనుమానంతో యువ ఇంజనీర్‌ను హతమర్చారు. వదినతో సన్నిహితంగా ఉంటున్నాడని, ఎలాగైనా దూరం చేయాలని మరిది ఈ హత్యకు పాల్పడ్డాడు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు.

విజయనగరం జిల్లాలో యువ ఇంజనీర్ హత్య సంచలనంగా మారింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా నెమలాం గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భర్త అమాయకుడైనా.. మరిది ఉన్నత చదువులు చదివాడు. ఉద్యోగాల కోసం అన్వేషణలో ఉన్నాడు. అయితే భార్యతో దూరపు బంధువు ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె మొబైల్ ఫోన్‌కి ప్రసాద్ మెసేజ్‌లు పంపించేవాడు. ప్రసాద్ పంపించిన మెసేజ్‌లను వాట్సాప్ వెబ్ ద్వారా ల్యాప్‌టాప్‌లో ఆమె మరిది చూసేవాడు.
పెళ్లి చూపుల కోసం వచ్చి..
వదిన, ప్రసాద్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఆమె మరిదికి ఇష్టం లేదు. దీంతో అతను తట్టుకోలేపోయాడు. బెంగళూరు వస్తానంటే ఉద్యోగం చూస్తానని ప్రసాద్ ఆమెకు పంపిన మెసేజ్‌ను చూసి మరింత కోపానికి గురయ్యాడు. వదిన చేస్తున్న వివాహేతర సంబంధాన్ని అన్నకు చెప్పి, ప్రసాద్‌ను హతమార్చేందుకు పథకం పన్నాడు. ఇంతలోనే బెంగళూరు నుంచి పెళ్లి చూపుల కోసం ప్రసాద్ స్వగ్రామం నెమలాం వచ్చాడు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
పొరుగూరులోని తాత ఇంటికి ప్రసాద్ వెళ్లడం ఈ అన్నదమ్ములు చూశారు. రాత్రి ఫోన్ చేసి నెమలాం సమీపానికి రప్పించారు. మార్గమధ్యలో మాటువేసి తొలిత కర్రతో కొట్టారు. ఆ తరువాత బండరాయికి ప్రసాద్ తలను కొట్టి హతమార్చారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. అందరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అనుకోవాలని అలా చేశారు. ప్రసాద్ వాడిన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి రోడ్డు పక్కనే పడేశారు. ఆ తరువాత ఏమీ తెలినట్లు ఇంటికి వెళ్లిపోయారు.
విచారణలో బయటపడ్డ నిజాలు..
అందరూ తొలిత రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని భావించారు. ఒంటిపై ఉన్న గాయాలను చూసి హత్యకు గురైనట్లు అనుమానించారు. అయితే ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అనేది మాత్రం తేలలేదు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పోలీసులు విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. వివాహేతర సంబంధం అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు పాల్పడిన అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నారు. వారే నేరం చేసినట్లు అంగీకరించారు. ప్రసాద్ మొబైల్ ఫోన్‌ను నేలబావిలో విసిరేసినట్లు నిందితులు చెప్పారు. దీంతో పోలీసులు నేల బావిలోని నీటిని తోడించి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)