Yeleru Bund Breach : ఏలేరు కాలువ‌కు గండి, భారీగా పంటనష్టం- పిఠాపురం నియోజకవర్గానికి వరద ముప్పు-yeleru reservoir canal bund breaches crop loss pithapuram constituency villages flooded ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Yeleru Bund Breach : ఏలేరు కాలువ‌కు గండి, భారీగా పంటనష్టం- పిఠాపురం నియోజకవర్గానికి వరద ముప్పు

Yeleru Bund Breach : ఏలేరు కాలువ‌కు గండి, భారీగా పంటనష్టం- పిఠాపురం నియోజకవర్గానికి వరద ముప్పు

HT Telugu Desk HT Telugu
Sep 09, 2024 03:19 PM IST

Yeleru Bund Breach : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కాకినాడ జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గండి పూడ్చివేత పనులు చేపట్టారు.

ఏలేరు కాలువ‌కు గండి, భారీగా పంటనష్టం- పిఠాపురం నియోజకవర్గానికి వరద ముంపు
ఏలేరు కాలువ‌కు గండి, భారీగా పంటనష్టం- పిఠాపురం నియోజకవర్గానికి వరద ముంపు

Yeleru Bund Breach : రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా భారీ వ‌ర్షాలు ప‌డ‌టంతో ఏలేరు ప్రాజెక్టు కాలువ‌కు గండి ప‌డింది. దీంతో దిగువ ప్రాంతాల‌కు నీటి ప్రవాహం పెరిగింది. గండి పూడ్చేందుకు అధికారులు చ‌ర్యలు చేపట్టారు.

ఏలేరు పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఏలేరు కాలువకు వ‌ర‌ద నీరు పోటెత్తింది. దీంతో ఉద్ధృతంగా ప్రవ‌హిస్తున్న ఏలేరు కాలువ‌కు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండం రాజుపాలెం గ్రామం వ‌ద్ద గండిప‌డింది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కాకినాడ జిల్లా క‌లెక్టర్ షాన్‌మోహ‌న్ ఆదేశాల‌తో గండిపూడ్చేందుకు అధికారులు చ‌ర్యలు చేప‌ట్టారు. జేసీబీ వాహ‌నాల‌తో గండి పూడ్చివేత చ‌ర్యలు ముమ్మరం చేశారు. బ‌స్తాల్లోకి ఇసుక ఎత్తి వాటి ద్వారా గండి పూడ్చే ప‌నులు యుద్ధప్రాతిప‌దిన‌క చేస్తున్నారు. గండి ప్రభావంతో దిగువ ప్రాంతాల్లోని పొలాలు, ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు చేరింది. కాకినాడ జాయింట్ క‌లెక్టర్ అపూర్వ భ‌ర‌త్‌, ఆర్డీవో సీతారామ‌రావు, ఎమ్మార్వో చిరంజీవి, మండ‌ల వ్యవ‌సాయ అధికారి జోకా అమ‌త గండి ప‌డిన ప్రాంతాన్ని పరిశీలించారు.

మ‌రోవైపు వ‌ర‌ద నీరు పోటెత్తడంతో ఏలేరు కాలువ నుంచి ప‌ది వేల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుదల చేశారు. ఇవాళ సాయంత్రానికి మ‌రో 5 వేల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఇప్పటి వ‌ర‌కు కిర్లంపూడి మండ‌లం మొత్తంగా దాదాపు 3,500 ఎక‌రాల పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లు అధికారులు తెలుపుతున్నారు. ఏలేశ్వరం శివారున గల ఏలేరు రిజర్వాయర్ కు క్రమంగా వరద నీటిమట్టం పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 86.56 మీటర్లు (24.11 టీఎంసీలు) కాగా జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 84.78 మీటర్ల స్థాయిలో 20.57 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ ద్వారా విశాఖకు 275 క్యూసెక్కుల వంతున నీటిని అధికారులు విడుదల చేశారు.

కాకినాడ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మీక్ష

ఏలేరు రిజర్వాయర్ కి జల ప్రవాహం పెరుగుతుండటం, వరద ముప్పు పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చిస్తున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్ కు ఇప్పటికే 21 టీఎంసీల నీరు చేరిన క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.

కాకినాడ జిల్లా కలెక్టర్ పరిస్థితిని వివరిస్తూ ఏలేరు రిజర్వాయర్ కి ఇన్‌ఫ్లో ఆదివారం ఉదయం 4 వేల క్యూసెక్కులు ఉంటే సాయంత్రానికి 8 వేల క్యూసెక్కులు ఉందన్నారు. రాత్రికి 10 వేల క్యూసెక్కులకు చేరుకుందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉంటుందని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామ‌ని జిల్లా కలెక్టర్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం కాకినాడ చేరుకుంటారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. ఏలేరు వరద ముప్పు పొంచి ఉన్న క్రమంలో నియోజక వర్గంలో ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లాలో విద్యా సంస్థల‌కు సెల‌వు ప్రక‌టించారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం