కూటమి ప్రభుత్వ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సూట్‌కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని.. కోట్లాది రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి దృష్టిని మళ్ళించేందుకే ఈ అరెస్ట్‌ల డ్రామాకు తెరతీశారని ఫైర్ అయ్యారు.
'ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్‌లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు' అని అంబటి వ్యాఖ్యానించారు.
'ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను.. బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కాదా? ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు' అని మాజీమంత్రి విమర్శించారు.
'కేవలం 11 నెలల్లో ఇంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే.. దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం. బెల్ట్ షాప్‌లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు' అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు,
'కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్‌లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా.. మారడం లేదు. అవసరమైతే డీజీపీని కోర్ట్‌కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. ఎల్లప్పుడూ చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి' అని రాంబాబు హెచ్చరించారు.
'గతంలో పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధీ, జయలలిత, జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్‌లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్‌లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ?' అని అంబటి ప్రశ్నించారు.
సంబంధిత కథనం