YCP MP Vijayasai Reddy : "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను" - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం-ycp mp vijayasai reddy announced his retirement from politics ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Mp Vijayasai Reddy : "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను" - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం

YCP MP Vijayasai Reddy : "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను" - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 24, 2025 06:40 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి జనవరి 25వ తేదీన రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏ పార్టీలోనూ చేరబోనని స్ఫష్టం చేశారు.

ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు(జనవరి 25) రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులో, ప్రయోజనాలో ఆశించి రాజీనామా చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

yearly horoscope entry point

“ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని” అని విజయసాయిరెడ్డి తన ప్రకటనలో రాసుకొచ్చారు.

వైసీపీ అధినేత జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. “పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా” అని విజయసాయిరెడ్డి చెప్పారు.

చంద్రబాబుతో విభేదాలు లేవు…

"దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది" అని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.

వ్యవసాయమే భవిష్యత్తు - విజయసాయిరెడ్డి

తన భవిష్యత్తు వ్యవసాయమే అని ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. “సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను” అని తన ప్రకటనలో రాసుకొచ్చారు.

వైసీపీలో కీలక నేతగా…!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి విజయసాయిరెడ్డి కీలక నేతగా ఉన్నారు. జగన్ కు కుడి భుజంగా ఉండే నేతగా విజయసాయిరెడ్డికి పేరుంది. పార్టీ ఏర్పాటు నుంచి నేటి వరకు కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. హస్తిన రాజకీయాల్లో వైసీపీ తరపున చక్రం తిప్పగలిగారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డి… ఓడిపోయారు. 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోరంగా ఓటమిపాలైంది. కేవలం 11 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఆ తర్వాత కొందరు కీలక నేతల పార్టీ నుంచి బయిటికి వెళ్లారు. క్షేత్రస్థాయిలో కూడా పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బనే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

Whats_app_banner