MP Vijayasai Reddy : పురంధేశ్వరి గారు... ఆ పుస్తకాన్ని అమిత్ షాకు ఇచ్చారా..? లేదా..?
YCP MP Vijaya Sai Reddy News : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? లేక బీజేపీలో ఉన్నారా? అంటూ సెటైర్లు విసిరారు.
MP Vijayasai On Purandeswari : ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఆంధ్రా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాగా… మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక వైసీపీ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ వేదికగా తన వాయిస్ ను వినిపించే ప్రయత్నం చేస్తుండటంతో పాటు ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా… తాజాగా అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ…. పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
“పురంధేశ్వరి గారు! బాబు అవినీతికి శిక్ష పడాలి. బాబు అవినీతికి ఆధారాలన్నీ చూపిస్తూ అరెస్టు జరిగింది. బాబు అవినీతిని రాష్ట్ర సీఐడీ, కేంద్ర ఈడీ, కేంద్ర ఐటీ నిర్ధారించాయి. మరి అలాంటప్పుడు బాబుకు మీ మద్దతు అంటే దాని అర్థం ఏమిటి? మీది నేరానికి మద్దతా...లేక చట్టానికి మద్దతా..? బాబుకు 17–ఏ సెక్షన్ వర్తిస్తుందని...ఆ సెక్షన్ ప్రకారం గవర్నర్ గారి అనుమతి తీసుకునే అరెస్టు చేయాలని బాబు లాయర్లు వాదిస్తున్నారు తప్ప, బాబు ఏ నేరం చేయలేదని...ఏ విచారణకైనా సిద్ధం అని మాట వరసకు కూడా అనటం లేదు! ఇలాంటి అవినీతి బాగోతంలో మీరంతా మీ కుటుంబంగా, బాబు జనతా పార్టీగా చంద్రబాబు వైపు నిలబడ్డారు! మరి ఈ అవినీతి బాగోతంలో తాము ఎటువైపు నిలబడాలన్నది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి! మరో విషయం కూడా... చంద్రబాబు అవినీతి గురించి, దుర్మార్గాల గురించి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో రాసిన ‘‘ఒక చరిత్ర కొన్ని నిజాలు’’ అన్న పుస్తకాన్ని అమిత్ షా గారికి ఇచ్చారా? లేక ఆ పుస్తకం మీద, మీ ఆయన మీద కూడా మీరు, లోకేశ్ కలిసి అమిత్‌షా గారికి ఫిర్యాదు చేశారా? అన్నది కూడా మా రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి.
బీజేపీలో ఉన్నారా..? 'టీడీపీలో ఉన్నారా..?
అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరవాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్థించి, రిమాండ్ విధించిందని గుర్తు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సరికాదన్న వాదనల్ని హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయని రాసుకొచ్చారు. “సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్‌లు– సిద్ధార్థ్ లూధ్రా, హరీష్ సాల్వే బాబు కోసం చేసిన వాదనల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి కాబట్టి... 'బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్' అన్న విధంగా మీ మరిది కోసం మీరు రంగంలోకి దిగారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని మీరే అబద్ధం చెపుతూ, లోకేశ్‌ని వెంటబెట్టుకుని బాబు తరఫున మధ్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గారిని కలిశారు. ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? లేక బీజేపీలో ఉన్నారా? మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు బీజేపీలో ఉన్నానని అంటున్నా– మీ టాప్ ప్రయారిటీ మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు!” అని సెటైర్లు విసిరారు.
సంబంధిత కథనం