AP Ration Shops: రేషన్‌ దుకాణాల కేటాయింపులో అక్రమాలు, దుకాణాల కేటాయింపుపై విచారణకు వైసీపీ డిమాండ్-ycp is concerned about irregularities in the allocation of ration shops and allocation to the ineligible ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Shops: రేషన్‌ దుకాణాల కేటాయింపులో అక్రమాలు, దుకాణాల కేటాయింపుపై విచారణకు వైసీపీ డిమాండ్

AP Ration Shops: రేషన్‌ దుకాణాల కేటాయింపులో అక్రమాలు, దుకాణాల కేటాయింపుపై విచారణకు వైసీపీ డిమాండ్

AP Ration Shops: ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ దుకాణాల కేటాయింపు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న దుకాణాల నుంచి రేషన్‌ కార్డులను విభజించి కొత్త దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది.

రేషన్‌ దుకాణాల కేటాయింపులో అక్రమాలపై వైసీపీ ఆందోళన

AP Ration Shops: ఏపీలో కొత్త రేషన్ దుకాణాల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తమ వారికి రేషన్ షాపులు కేటాయించే పనిలో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు సిఫార్సులు చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దుకాణాల కేటాయింపు వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

విజయవాడ నగరంలో కొత్తగా 111 రేషన్ షాపులకు నోటిఫికేషన్ జారీ చేయగా 1200 మంది అభ్యర్థులు రేషన్ దుకాణాల కోసం పరీక్షలు రాశారు. పరీక్ష రాసిన వారిలో 372 మంది క్వాలిఫై అయ్యారు. మెజారిటీ రేషన్ దుకాణాలను ఎమ్మెల్యే లు సిఫార్సు చేసిన వారికి ఇచ్చారు.

నగరానికి చెందిన రేషన్‌ బియ్యం సిండికేట్ కు పెద్ద ఎత్తున షాపులు కేటాయించారని, దుకాణాలను కేటాయించిన అభ్యర్థులకు రెసిడెన్స్ ప్రూఫ్ లేకపోయినా, ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోయినా, రెసిడెన్స్ ప్రూఫ్ మార్చి ఇచ్చినా వారికి షాపులు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తోంది.

నగరంలోని YSR కాలనీ కేంద్రంగా నడిచే రేషన్ బియ్యం మాఫియా నాయకుడి కనుసన్నల్లోనే కొత్త దుకాణాల కేటాయింపు జరుగుతోందని ఆరోపిస్తున్నారు. బియ్యం మాఫియా మీద యుద్ధం అంటూ వారికే రేషన్ డిపోల కేటాయింపు మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇంటర్‌ అర్హతతో పరీక్ష, పీజీ అభ్యర్థుల దరఖాస్తులు

ఇంటర్మీడియట్ విద్యార్హతలుగా చౌక ధరల దుకాణాలు కేటాయింపుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 1200మంది దరఖాస్తు దారుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు 60% , పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు 30% , 10% మాత్రమే ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఈ దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు.

రేషన్ షాపుల ద్వారా నెలకు వచ్చే రూ.8000 నుంచి రూ.15వేల ఆదాయం కమిషన్ రూపంలో లబిస్తుంది. ఇంటర్మీడియట్ అర్హత సరిపోయే రేషన్‌ దుకాణాల కోసం గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు పోటీ పడుతున్నారు. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో కనీసం రేషన్ దుకాణాలు దక్కినా చాలనే పోటీ ఏర్పడింది.

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని చెబుతున్నా విజయవాడలో ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉన్న వారికే దుకాణాలను కేటాయించడంపై విచారణ జరపాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.