Amaravati loan: అమరావతి అప్పుకు ప్రపంచ బ్యాంకు సమ్మతి, తొలివిడతలో రూ.3750కోట్లు, రుణ చెల్లింపు బాధ్యత కేంద్రానిదే..!-world bank agrees to amaravati loan rs 3750 crores in the first installment the center will be responsible for paying ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Loan: అమరావతి అప్పుకు ప్రపంచ బ్యాంకు సమ్మతి, తొలివిడతలో రూ.3750కోట్లు, రుణ చెల్లింపు బాధ్యత కేంద్రానిదే..!

Amaravati loan: అమరావతి అప్పుకు ప్రపంచ బ్యాంకు సమ్మతి, తొలివిడతలో రూ.3750కోట్లు, రుణ చెల్లింపు బాధ్యత కేంద్రానిదే..!

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 02, 2024 05:43 AM IST

Amaravati loan: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భరోసాతో నిధుల సమీకరణ కష్టాలు తీరనున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు అమరావతికి కేంద్రం గ్యారంటీతో ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది.ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కన్సార్షియం సమాచారం ఇచ్చాయి.

అమరావతి అప్పుకు వరల్డ్‌ బ్యాంక్ ఓకే
అమరావతి అప్పుకు వరల్డ్‌ బ్యాంక్ ఓకే (photo source from APCRDA Twitter)

Amaravati loan: అమరావతి నిర్మాణంపై తీపికబురు అందింది. ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు ఊతమిచ్చేలా ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్ కన్సార్షియం నుంచి కేంద్ర ప్రభుత్వ హామీతో రుణాన్ని మంజూరు చేయడానికి సమ్మతి తెలిపాయి. గత ఐదేళ్లుగా అమరావతి పనులు నిలిచిపోవడంతో పాటు అంతకు ముందు చేపట్టిన పనులకు సంబంధించి దాదాపు రూ.9వేల కోట్ల మేర బిల్లులు బకాయి చెల్లించాల్సి ఉంది.

2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి అమరావతి పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనుల పునురుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి నిధులు గ్యారంటీగా ఇస్తామని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. గతంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకులు అమరావతి నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదని లేఖ రాయడంతో వాటిని ఉపసంహరించుకున్నాయి.

రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో మంజూరు చేసిన రుణం కోసం ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా గ్యారంటీగా ఉండటానికి సుముఖత తెలుపడంతో రుణం మంజూరు అంశం కొలిక్కి రానుంది. మరి కొద్ది రోజుల్లో ఆ ప్రక్రియ కొలిక్కి రానుంది. 2025 జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిఆర్‌డిఏ సిద్ధం అవుతోంది.

రాజధాని నిర్మాణం కోసం రూ. 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్‌ బ్యాంక్, ఏడీబీ కన్సార్షియం ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. మొత్తం రూ.15 వేల కోట్లూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సీఆర్డీఏకి అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి, రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన లేఅవుట్లను అభి వృద్ధి చేయడం, పరిపాలన నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు రూ.49 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మేరకు సవరించిన అంచనాలను సీఆర్డీఏ ఇటీవల సిద్ధం చేసింది. పాతబాకీలు కూడా భారీగా చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.15 వేల కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను సిఆర్‌డిఏ ప్రారంభించింది.

డిసెంబర్ నాటికి నిధులు

ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి మంజూరైన రుణం విడుదల కోసం కావాల్సిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ప్రపంచబ్యాంకు బృందం మూడు నాలుగు దఫాలుగా రాజధానిలో పర్యటించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ, ప్రపంచబ్యాంకు, సీఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరుగుతుంది. నవంబరు 8న తుది సమావేశం జరుగుతుంది. నవంబర్‌ 15 నాటికి ఒప్పందాలు పూర్తవుతాయి. ఈ ప్రక్రియ పూర్తయితే రూ.15 వేల కోట్లు మంజూరైనట్టేనని అధికారులు చెబుతున్నారు.

రుణం మంజూరుపై ఒప్పందం కుదిరిన వెంటనే మొత్తం రుణంలో 25%గా . రూ.3,750 కోట్లు అడ్వాన్స్‌ రూపంలో అందుకోవచ్చు. డిసెంబర్‌ నాటికి ఈ నిధులు అందుతాయని అంచనా వేస్తున్నారు.

రుణం చెల్లింపు బాధ్యత కేంద్రానిదే…

ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకునే మొత్తంలో 90 శాతం కేంద్రమే భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రకటనలో కేంద్రం ఇచ్చే సాయాన్ని గ్రాంటుగా పేర్కొనకపోవడం వివాదాస్పదం అయ్యింది. ఆ తర్వాత నిర్మలా సీతారామన్‌ వివరణ ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఈ నిధులను అయా సంస్థల ద్వారా ఇ స్తోంది.

ప్రపంచ బ్యాంక్‌ రుణంపై 15 ఏళ్లపాటు మారటోరియం ఉంటుంది.ఇందుకు చెల్లించే వడ్డీ కూడా 4%లోపే ఉంటుంది. ఆ రుణంలో కేంద్రప్రభుత్వం 90%, రాష్ట్రప్రభుత్వం 10% చొప్పున భరించాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన 10% నిధుల్లో రూ.1500కోట్లను కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని ఆర్థికశాఖ చెబుతోంది. సవరించిన అంచనాలతో టెండర్లు పిలిచి డిసెంబర్‌-జనవరి నుంచి అమరావతి పనులను పట్టాలు ఎక్కించేందుకు రెడీ అవుతున్నారు.