టీడీపీలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల పెన్షన్ ఇవ్వడం లేదని, అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని.. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అన్నారు.
గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ....అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలని, బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పార్టీ తరపున పలు హామీలు ఇచ్చామని ఒక్కొక్కటిగా వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
11నెలల ప్రజా ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ 4వేలకు, వికలాంగ పెన్షన్ 6వేలకు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలితీర్చే అన్నక్యాంటీన్లు ప్రారంభించామని ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఉచిత గ్యాస్ పథకంలో నిబంధనలు సడలించి లబ్ధిదారుల ఎకౌంట్ లో నేరుగా డబ్బులు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. మత్స్రకారులకు ఆర్థికసాయం అందించాం, చేనేతలకు 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చాం. రోడ్లపై గుంతలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. జూన్ మాసంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకెళ్తున్నామన్నారు.
ప్రభుత్వం స్కూళ్లు మూసివేస్తుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఒక్క పాఠశాలను కూడా మూయడం లేదని ఒక క్లాస్ కు ఒక టీచర్ ఉండాలన్నదే మన ధ్యేయం అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి కేవలం 1200 స్కూళ్లలో క్లాసుకో టీచర్ ఉంటే, ఇప్పుడు 9800 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వ స్కూళ్లలో 45లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పుడు 33లక్షలకు పడిపోయారని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం అన్నారు.
మంత్రి నారాయణ సహకారంతో ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో మంచి ఫలితాలు వచ్చాయని, ప్రభుత్వం ఏర్పడి జూన్ నెలకు సంవత్సరం అవుతుందని జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పారు.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అన్నీచేస్తామన్నారు. బీజేపీ, జనసేన పార్టీతో కలిసి పొత్తుతో పోటీచేశామని నామినేటెడ్ పదవుల విషయంలో వారితో మాట్లాడి పదవులు ఇస్తున్నామని చెప్పారు. కొందరు వైసీపీ వాళ్లు అపోహలు సృష్టిస్తున్నారని వాటిని నమ్మొద్దన్నారు.
యువగళం పాదయాత్ర చేసినపుడు కార్యకర్తల అభీష్టం మేరకు కష్టపడిన కార్యకర్తలను గుర్తించడానికి మీ ముందుకు వస్తున్నానని లోకేష్ వివరించారు. రేపు మెగా సోలార్ పార్కు శంకుస్థాపనకు వచ్చే ముందు ఇక్కడకు వచ్చా. అయిదేళ్లలో వైసిపి ప్రభుత్వం చేయలేనిది 11నెలలో చేసి చూపించామన్నారు. కరెంటు చార్జీలు పెంచమని చెప్పామని, జగన్ నిర్వాకం వల్లే ట్రూ అప్ చార్జీలు వేయాల్సి వస్తోందన్నారు.
పార్టీ కేడర్ రెడ్ బుక్ గురించి అడుగుతున్నారని కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని వదలనని లోకేష్ అన్నారు. తనంతట తాను ఎవరితో గొడవపెట్టుకోనని మన జోలికి వస్తే మాత్రం వదలనన్నారు.
గత ప్రభుత్వంలో మద్యంలో ఎంత కుంభకోణం జరిగిందో రాష్ట్రమంతా చూస్తున్నారని ప్రజలను చైతన్యవంతులను చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో కొంచెం సమయం పట్టొచ్చు. కార్యకర్తలు అహంకారం లేకుండా ప్రజల్లోకి వెళ్లి వారి చుట్టూ తిరగాలని పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. కార్యకర్తల కోసం జగన్ పై కంటే మూడురెట్ల ఎక్కువగా పార్టీలో పోరాడుతున్నా అన్నారు.
సంబంధిత కథనం