SatyaSai District: సత్యసాయి జిల్లాలో అమానుషం...ప్రేమ జంటకు సహకరించిందనే అనుమానంతో మహిళను వివస్త్రను చేసి దాడి…
SatyaSai District: శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంటకు సహకరించిందనే అనుమానంతో మహిళకు జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడి పైశాచికంగా ప్రవర్తించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళలను ఆసుపత్రికి తరలించారు.
SatyaSai District: ప్రేమ జంటకు సహకరించిందనే అనుమానంతో మహిళపై అమానుషంగా దాడి చేసిన ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిమడుగు గ్రామంలో ఒక యువకుడితో అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రేమలో పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట ఇద్దరూ పారిపోయారు. దీంతో బాలిక తల్లిదండ్రులు సోమవారం (ఈనెల 13న) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం వారి ఆచూకీ కనుక్కొని, బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ప్రేమ జంట పారిపోవడానికి సాయం చేసిందన్న కోపంతో అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు బుధవారం దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించి దుశ్చర్యకు పాల్పడ్డారు.
దీంతో అవమానంతో ఆ వివాహిత ఇంట్లోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నారు. వెంటనే స్థానికులు ఆమెకు నచ్చజెప్పి పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆసుపత్రికి చేరుకుని, బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. అలాగే పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకుని అక్కడ పరిశీలించారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆమె ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులు, మరో 11 మంది బంధువులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. కేసు విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు పూర్తి అయిన తరువాత, తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతానికి నింధితులు తమ అదుపులోనే ఉన్నారని తెలిపారు. ఇలాంటి అమానీవయ ఘటనలు చోటు చేసుకోవడం దారుణమని అన్నారు. బాధితురాలికి వైద్యం అందిస్తున్నారని, ఆమె ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)