East Godavari Crime : మహిళపై సామూహిక అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితులు!
East Godavari Crime : తూర్పు గోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పథకం ప్రకారం మాటు వేసి మరీ.. ఈ అకృత్యానికి ఒడిగట్టారు. అత్యాచారం చేసిన తరువాత బాధిత మహిళను హత్య చేసి పంట కాలువలో పడేశారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో దారుణ ఘటన జరిగింది. ఒరిస్సాకు చెందిన మహిళ (43)పై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళను దారుణంగా హత్య చేశారు. ఒరిస్సాలోని పర్లాకెముండి ప్రాంతానికి చెందిన దంపతులు చాలా కాలం క్రితం కడియం మండంలోని ఓ గ్రామానికి వలస వచ్చారు. అక్కడ నర్సరీల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి దివ్యాంగురాలైన కుమార్తెతో పాటు డిగ్రీ చదివే కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 15న ఆమె నర్సరీలో పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా, బుర్రిలంకకు చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ (22) అడ్డగించి.. కోరిక తీర్చమని బలవంతం చేశారు. బాధిత మహిళ అందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించారు. బాధితురాలు ప్రతిఘటించడంతో.. సమీపంలోని మొక్కల్లోకి లాక్కెళ్లి తువ్వాలను నోట్లో కుక్కారు.
చేతులు, కాళ్లు పట్టుకుని ముక్కు మూసేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. నిందితులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను సమీపంలోని పంట కాలువలోకి పడేశారు. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కడియం పోలీసు స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేశారు. నర్సరీల వద్ద మృతురాలి కుమారుడి స్నేహితులకు నల్లపూసల దండ, గాజులు, రుమాలు, పిన్నులు కనిపించాయి.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి నర్సరీల్లో పనులకు హాజరవ్వని వారు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీశారు. దేవర యేసు పేరు తెరపైకి వచ్చింది. అతడు తెలిపిన వివరాలతో మిగతా ముగ్గురినీ అరెస్టు చేశారు. నలుగురినీ గురువారం రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ భవ్య కిశోర్ వెల్లడించారు. యేసు పథకం ప్రకారం.. తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందారా? కాలువలో పడేసిన తరువాత చనిపోయారా? అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందని పోలీసులు వివరించారు. నిందితులు నిత్యం గంజాయి, మద్యం మత్తులో ఉంటారని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)