Kurnool Attack: వివాహేతర సంబంధం అనుమానంతో వితంతువుపై హిజ్రాలతో కలిసి దాడి చేసిన మహిళ.. కర్నూలులో ఘటన
Kurnool Attack: కర్నూలు జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసకుంది. ఒక వ్యక్తితో వితంతు మహిళ చనువుగా ఉండటంతో అతని భార్య వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకుంది. దీంతో ఆ మహిళపై హిజ్రతో కలిసి ఆయన మూకుమ్మడి దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Kurnool Attack: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో దారుణ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం అనుమానంతో వితంతువును చెట్టుకు కట్టేసి గుండె గీసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఓర్వకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త అనారోగ్యంతో ఏడాది క్రితం చనిపోయాడు. అయితే ఆ వితంతు మహిళ, ఒక వివాహితుడుతో చనువుగా ఉండటం ఆయన భార్య గుర్తించింది. తన భర్త రామకృష్ణతో ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంటుందని ఆయన భార్య సుజాతకు అనుమానం వచ్చింది.
దీంతో ఆమెపై దాడి చేయాలని సుజాత భావించింది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం, గోవర్ధనగిరికి చెందిన సుజాత బంధువు మహేష్ అలియాస్ మహి అనే హిజ్రను హుసేనాపురం గ్రామానికి పిలిపించుకుంది. అనంతరం పథకం ప్రకారమే ఆ వితంతు మహిళను ఇంటి వద్దకు పిలుపించుకుంది. మహిళ ఇంటికి వచ్చిన తరువాత ఆమెపై మూకుమ్మడి దాడి చేశారు. ఆ తరువాత స్తంభానికి కట్టేసి, గుండు గీయించేందుకు యత్నించారు.
ఈ క్రమంలో స్థానికులు జోక్యం చేసుకుని సుజాత కుటుంబం చర్యలను అడ్డుకున్నారు. దీంతో ఆ వితంతు మహిళ తీవ్రంగా అవమానభారానికి లోనైంది. గురువారం ఓర్వకల్లు పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సుజాత, హిజ్ర మహిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యు. సునీల్ కుమార్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు.
బెంగళూరులో కళ్యాణదుర్గం యువతి ఆత్మహత్య
బెంగళూరులో కళ్యాణదుర్గం యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలోకి వెళ్లింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బెస్తరహళ్లికి చెందిన రుచిత (25) బెంగళూరులోని బయోకాన్ కంపెనీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది.
తల్లిదండ్రులతో కలిసి మల్లసంద్రంలో నివాసముంటోంది. ఫీణ్యా 2వ స్టేజ్‌లో తల్లిదండ్రులు ఓ బట్టల షాప్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు షాప్‌కు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న రుచిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కుమార్తెకు ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుమార్తె విగతజీవిగా తల్లిదండ్రులకు దర్శనం ఇచ్చింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న బాగలగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సూసైడ్ నోట్ ఏదీ లభ్యం కాకపోవడంతో ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)