Secret Friends : రహస్య మిత్రులు… ఎవరి కోసం ఎవరు…?
Secret Friends ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయడానికి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఆంధ్రాతో సహా దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ జెండా రెపరెపలాడించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్‌ఎస్ ఏపీలో నిజంగానే పాగా వేస్తుందా లేకుంటే ఎవరికైనా లబ్ది చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కలగక మానవు…
Secret Friends ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య రాజకీయ వైరుధ్యాలేమి లేవు. ఒకరి ప్రాదేశిక రాజకీయాల్లోకి మరొకరు అడుగుపెట్టరు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎనిమిదేళ్ల క్రితం కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఏపీలో ఐదేళ్లు ఆలశ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఇరువురు నేతలు కోరుకున్నారు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్రసమితి విస్తరణను ఏపీతో ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఆర్ధిక వనరులు పుష్కలంగా ఉండి, ఒకటికి మూడుసార్లు చేతులు కాల్చుకున్న తోట చంద్రశేఖర్‌కు ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌తో పాటు మరికొందరు నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేసీఆర్ బిఆర్‌ఎస్ పార్టీతో ఏమి సాధిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
తెలంగాణ అస్తిత్వం పేరుతో పార్టీ స్థాపించి దానిని సాకారం చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చినా కేసీఆర్‌కు ఎంత వరకు అవకాశాలు లభిస్తాయనే విషయంలో అందరిలోను అనుమానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటీగా బిఆర్ఎస్ ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అంటే నిస్సందేహం అని చెప్పే పరిస్థితి ఇప్పుడే లేదు. ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడం ద్వారా అంతిమంగా ఎవరికి లబ్ది చేకూరుతుందనే అనుమానాలు కూడా కలగక మానవు.
ఏపీలో పార్టీల మధ్య పొత్తుల రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం బీజేపీ,జనసేన మధ్య అవగాహన ఉన్నా, ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీల కాపు ఓటు బ్యాంకు మీదే ఆశలన్నీ పెట్టుకున్నాయి. జనసేనతో జట్టు కట్టడం ద్వాారా కొన్ని స్థానాల్లో అయినా గెలవాలని బీజేపీ భావిస్తున్నా, టీడీపీతో పొత్తుకు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు లక్ష్యంగా బిఆర్‌ఎస్ కూడా ఏపీలో అడుగుపెడుతోంది.
తాము ఏ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని వైఎస్సార్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. బీజేపీతో ఉన్న సంబంధాలు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పేశారు. బీజేపీ పట్ల తమ వైఖరి రాజకీయ ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని ఆ పార్టీ నేతలు పదేపదే చెబుతున్నారు. జనసేన-టీడీపీ లేకుంటే జనసేన-బీజేపీ, జనసేన-టీడీపీ-వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే కాపు ఓట్లలో ఖచ్చితంగా చీలిక ఏర్పడుతుంది. బిఆర్‌ఎస్ పార్టీ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే అయినా గెలుపొటముల విషయంలో ప్రతి ఓటు లెక్కలోకి వస్తుంది కాబట్టి ఆ పార్టీ పాత్రను కొట్టి పారేయలేని పరిస్థితి ఉంటుంది.
గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిందని జనసేన, టీడీపీ బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ బరిలోకి దిగితే అది దెబ్బతీసే అవకాశాలు ఏ పార్టీవనే చర్చ ఏపీలో జరుగుతోంది. ఏపీలో వైసీపీకి ఉన్నసంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే. ప్రస్తుతానికి దానికి మద్దతుగా ఉన్న వర్గాల ఓటు బ్యాంకు ఆ పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది. బిఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చడం అనివార్యమైతే అది తమ ప్రత్యర్థులకు చేటు చేస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.