Vangaveeti Radha : రాజకీయాలకు రాంరాం.. వంగవీటి రాధాపై ఎందుకీ ప్రచారం జరుగుతోంది?-will vangaveeti radha krishna retire from politics ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vangaveeti Radha : రాజకీయాలకు రాంరాం.. వంగవీటి రాధాపై ఎందుకీ ప్రచారం జరుగుతోంది?

Vangaveeti Radha : రాజకీయాలకు రాంరాం.. వంగవీటి రాధాపై ఎందుకీ ప్రచారం జరుగుతోంది?

Vangaveeti Radha : వంగవీటి రాధా.. ఈ పేరు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. అందుకు కారణం ఆయన తండ్రి రంగా. కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన రంగా.. దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రాధా.. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఏ పదవీ రాలేదు.

వంగవీటి రాధా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే రాజకీయ రాజధాని విజయవాడ. అలాంటి బెజవాడలో రాజకీయంగా చక్రం తిప్పింది వంగవీటి కుటుంబం. వంగవీటి రాధా (రంగా సొదరుడు) హత్య తర్వాత విజయవాడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. రంగా ప్రవేశంతో వేడెక్కింది. 1985లో రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. రంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

జైల్లో ఉండగానే..

రంగా జైల్లో ఉండగానే.. 1988 జులై 10న జరిగిన కాపునాడు సభలో ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన రంగా.. జనచైతన్య యాత్ర చేసి ఎన్.టి.రామారావు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పోలీసులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని పోరాడారు. పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారు. విజయవాడలోని గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

రంగా దారుణ హత్య..

1988 డిసెంబర్ 26న పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న రంగాను.. ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆయన హత్య తర్వాత కోస్తాంధ్రలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కేసులు, అరెస్టులు, గొడవలు, ధర్నాలు జరిగాయి. చాలా రోజుల తర్వాత రంగా కుమారుడు రాధా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

విజయం దక్కలేదు..

2009లో విజయం దక్కలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు వంగవీటి రాధా. 2014లోనూ అదృష్టం వరించలేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అప్పుడు ఎక్కడా పోటీ చేయలేదు. పార్టీ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ.. టీడీపీ అధికారంలోకి రాలేదు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. 2019 నుంచి 2024 వరకూ ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు.

పార్టీ కోసం ప్రచారం..

2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎక్కడా పోటీ చేయలేదు. కానీ.. పార్టీకోసం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాధా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక రాధాకు పదవీ ఖాయం అని ఆయన అనుచరులు అనుకున్నారు. మొదటి నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. రాలేదు.

అనుచరుల అసంతృప్తి..

ఆ తర్వాత రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అదీ కుదరలేదు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం వస్తుందని ఊహించారు. అదీ జరగలేదు. దీంతో ఆయన అనుచరులు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ ఉంది. ఇన్నాళ్లుగా ఏ పదవి లేదని.. ఇప్పుడు అధికారంలో ఉన్నా.. ఎందుకు ఇవ్వడం లేదని రాధా అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

జోరుగా ప్రచారం..

అటు రాధా కూడా ఆయనకు కనీస గౌరవం దక్కలేదని, తన సేవలను గుర్తించలేదని తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఏ పార్టీలోకి వెళ్లినా ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన రాధా.. రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య రంగా, రాధా మిత్రమండలి సమావేశంలో కూడా తీవ్ర నైరాశ్యంతో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రాధా మిత్రుడి వెర్షన్..

ఈ నేపథ్యంలో.. విజయవాడకు చెందిన రాధా మిత్రుడు ఒకరితో 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధి మాట్లాడారు. 'రాధా రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్తారు.. అలాంటిది ఏం లేదు. ఆయన చాలా కంఫర్ట్‌గా ఉన్నారు. రాధాకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది. అప్పటివరకు ఓపికగా ఉంటాం. కొందరు కావాలని తప్పుడు చేస్తున్నారు. రాధా రాజకీయాల్లోనే ఉంటారు. ఆ మధ్య కాస్త అనారోగ్య సమస్యల వల్ల యాక్టివ్‌గా లేరంతే' అని రాధా మిత్రుడు చెప్పారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం