Miryalaguda Congress : బీఎల్ఆర్ కు లైన్ క్లియర్ అయినట్టేనా..? ఇంకా ట్విస్ట్ లు ఉన్నాయా..?
Telangana Assembly Elections 2023: పొత్తు విషయంలో కాంగ్రెస్ కు సీపీయం గుడ్ బై చెప్పిన నేపథ్యంలో… మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ బీఎల్ఆర్ కు దక్కటం ఖాయమని తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో ఇంకా ఏమైనా ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
Miryalaguda Congress Ticket: కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు చిత్తయ్యాక.. పొత్తు మిషతో ఇన్నాళ్లూ పెండింగులో పెట్టిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇక తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వంద స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా మరో 19 సీట్లలో అభ్యర్థులు ఎవరో తేల్చాల్సి ఉంది. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇంకా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెండింగులో ఉన్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తిలో ముగ్గురు నాయకులు టికెట్ రేసులో ఉండగా, సూర్యాపేటలో ఇద్దరు నాయకుల మధ్య కాంగ్రెస్ దోబూచులాడుతోంది. ఇక, మరో కీలక నియోజకవర్గం మిర్యాలగూడ లో టికెట్ ప్రకటనకు ఇప్పటి దాకా అడ్డంకిగా ఉన్న వామపక్షాల పొత్తు అంశం తేలిపోవడంతో ఈ నియోజకవర్గంలో కూడా తమ గెలుపు గుర్రం ఎవరో తేల్చాల్సి ఉంది.

ఒంటరిగా సీపీఎం పోటీ నిర్ణయంతో .. తొలిగిన అడ్డంకి
కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు చర్చల్లో సీపీఎం బలంగా డిమాండ్ చేసిన నియోజకవర్గం మిర్యాలగూడెం. ఇక్కడి ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలోనే విజయాల ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటికే మూడు సార్లు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జూలకంటి రంగారెడ్డి ఈ సారికూడా పోటీ చేస్తారని, పట్టున్న మిర్యాలగూడను తమకు కేటాయించాలని సీపీఎం కోరుతూ వచ్చింది. ఈ సీటును సీపీఎంకు కేటాయించడానికి కాంగ్రెస్ నాయకత్వం కొంత సుముఖంగా ఉన్నా.. మిగతా సీట్లలో వచ్చిన పేచీ వల్ల అసలు పొత్తు అంశమే ఎత్తిపోయింది. కాంగ్రెస్ నుంచి అనుకున్నంత చొరవ లేకపోడంతో చూసీ చూసీ విసిగిపోయిన సీపీఎం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 17 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆ నియోజకవర్గాల పేర్లను కూడా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కు ఉన్న అడ్డంకి తొలిగినట్లు అయ్యింది. ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది.
బీఎల్ఆర్ కు టికెట్ దక్కేనా..?
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీపీసీసీ నాయకత్వానికి టికెట్ కోసం దాఖలైన దరఖాస్తుల్లో అత్యధికంగా మిర్యాలగూడ టికెట్ కావాలనే దాఖలు అయ్యాయి. ఇక్కడి నుంచి 18 మంది టికెట్ కోసం దరఖాస్తు చేస్తుకున్నారు. కానీ, టికెట్ రేసులో ప్రధానంగా మిగిలింది మాత్రం బత్తుల లక్ష్మారెడ్డి అలియాస్ బీఎల్ఆర్. ఆయనతో పాటు కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, తెలంగాణ ఉద్యమ నాయకుడు అలుగబెల్లి అమరేందర్ రెడ్డి వంటి వారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరి టికెట్ ఇవ్వడం కుదరదన్న నిబంధన ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో ఉండడంతో ఇపుడు కాంగ్రెస్ లో టికెట్ రేసులో బిఎల్ఆర్ తో పాటు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నామని కాంగ్రెస్ నాయకత్వం చెబుతూ వస్తోంది.
మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఉన్న బీఎల్ఆర్ టికెట్ రేసులో అధిష్టానం వద్ద ముందు వరసలో ఉన్నారని అంటున్నారు. ఈ సీటును సీపీఎంకు కేటాయించే అవకాశం ఉందన్న వార్తలు వెలువడిన వెంటనే బీఎల్ఆర్ ‘ సేవ్ కాంగ్రెస్ సేవ్ మిర్యాలగూడ ’ పేరిట పాదయాత్ర చేశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకునేందకు కొందరు కాంగ్రెస్ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు కూడా గుప్పించారు. ఇపుడు సీపీఎం అడ్డంకి తొలిగి పోయిన నేపథ్యంలో బీఎల్ఆర్ కు టికెట్ కేటాయిస్తారా..? లేక, ప్రత్యామ్నాయ ఆలోచన ఏమన్నా చేస్తారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు ప్రతీ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ బీసీలకు ఇవ్వాల్సి ఉంది. భువనగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఆలేరులో యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్య యాదవ్ టికెట్ ఇచ్చారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఒక్క స్థానాన్నీ ప్రకటించలేదు. దీంతో మిర్యాలగూడెం టికెట్ ను బీసీ అభ్యర్థికి ఏమన్నా కేటాయిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్.క్రిష్ణయ్యను కాంగ్రెస్ పోటీకి పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికీ మిర్యాలగూడ సీటుపై స్పష్టత రావడం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )