Analysis: ఏపీలో ఆ పార్టీ గాలి మళ్లీ వీస్తుందా?-will the congress regain its glory in andhra pradesh with the leadership of gidugu rudra raju read the analysis of dileep reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Will The Congress Regain Its Glory In Andhra Pradesh With The Leadership Of Gidugu Rudra Raju? Read The Analysis Of Dileep Reddy

Analysis: ఏపీలో ఆ పార్టీ గాలి మళ్లీ వీస్తుందా?

HT Telugu Desk HT Telugu
Dec 02, 2022 02:24 PM IST

విభజన కారణంగా ఏపీ కాంగ్రెస్ తన ఉనికి చాటుకోలేని స్థితికి పడిపోయింది. అదే విభజనతో ముడివడి ఉన్న హోదా, నిరుద్యోగిత వంటి ప్రజాసమస్యలకు రాష్ట్రంలో కొదవేం లేని ఈ సమయంలో ఆ పార్టీకి గిడుగు రుద్రరాజు కొత్త అధ్యక్షుడయ్యారు. ఈ సందర్భంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ దిలీప్ రెడ్డి విశ్లేషణ.

ప్రత్యేక హోదా భరోసా యాత్రలో మాట్లాడుతున్న గిడుగు రుద్రరాజు (ఫైల్ ఫోటో)
ప్రత్యేక హోదా భరోసా యాత్రలో మాట్లాడుతున్న గిడుగు రుద్రరాజు (ఫైల్ ఫోటో)

‘గాలి ఉన్నపుడు వక్కలగడ్డ ఆదాము కూడా నెగ్గుతాడు’ అన్నది తెలుగునాట మలువడిన రాజకీయ నానుడని దివంగత నేత కొణిజేటి రోశయ్య చెప్పేవారు. గాలి వీస్తున్నపుడు గెలుపు ఎవరికైనా సునాయాసమే! ఎదురుగాలి వీస్తున్నప్పుడు అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఘోరమైన ఓటమి తప్పదు. ఎన్నికల రాజకీయాల్లో గెలుపే ప్రామాణికం. ఆ గెలుపుకోసమే రాజకీయ పక్షాల ఆరాటాలు, పోరాటాలు గనుక, అందుకోసం ముందుగా ప్రజాక్షేత్రంలో గాలి తమ వైపు వీచేలా భూమిక సిద్దం చేసుకోవడమే వాటి కర్తవ్యం. ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగంటిన నమ్మకం, సడలిన విశ్వాసంతో ఉన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కి మరింత ఎక్కువ వర్తిస్తుంది. కొత్త అధ్యక్షుడితో పాటు ఇతర నియామకాలతో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)ని పునర్వవస్థీకరిస్తున్న పార్టీ ఢిల్లీ నాయకత్వం ఈ విషయంపై దృష్టి సారించాలి. పాతికేళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, పీసీసీ నూతన అధ్యక్షుడైన గిడుగు రుద్రరాజు ముందు పెనుసవాళ్లే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

వాటిని హూందాగా స్వీకరించి, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్‌ పూర్వవైభవానికి ఎంతో కొంత ఆస్కారం ఉంటుంది. ఆ చిత్తశుద్ది లోపిస్తే, పార్టీ పునరుద్దరణ అన్నది... నివేదికల రూపంలో కాగితాలకు, నినాదాల రూపంలో ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అసలు ఫలితం దక్కదు. ప్రస్తుత ప్రభుత్వాన్ని, దాని వైఫల్యాలలను ఎంతగా ఎత్తిచూపినా... సరైన ప్రత్యామ్నాయం పై ప్రజలకు భరోసా కల్పించలేకపోతే విపక్షం విఫలమైనట్టే లెక్క! సుదీర్ఘకాలం తెలుగునేలను ఏలిన పాలకపక్షంగా సదరు కర్తవ్యం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపైనే ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని, రేపు ఎవరెవరితో జతకడుతుందో దాన్ని బట్టి సదరు కూటమిని దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదెలా నిర్వహిస్తుందన్నది, ఏడాదిన్నరకో, అంతకన్నా ముందేనో ఎన్నికలు ముంచుకురానున్న ఈ తరుణంలో ఏపీలో కాంగ్రెస్‌ వేసే అడుగుల్ని బట్టి ఉంటుంది.

అధిష్టానం అడుగులూ ముఖ్యమే!

ఉమ్మడి రాష్ట్రాన్ని నిర్హేతుకంగా విడగొట్టారన్న కోపంతోనే ఆంధ్ర ప్రజలు 2014లో కాంగ్రెస్‌ను ఘోరంగా ఓడిరచారన్నది రాజకీయ అభిప్రాయం. ఆ దెబ్బనుంచి 2019 నాటికి కూడా పార్టీ కోలుకోలేదు. అంతకు మున్ను కొంత, గత ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్‌ నాయకులు, వివిధ స్థాయిల్లోని కార్యకర్తల శ్రేణులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వెళ్లారు. పార్టీ భాషాణం ఖాళీ అయింది. గత ఎనిమిదున్నరేళ్లు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే పాలన, రాష్ట్రంలో తొలి విడత టీడీపీ, ఇప్పుడు వైసీపీ పాలన సాగుతున్నాయి.

కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్ని బట్టి రెండు ప్రభుత్వాలపైనా ప్రజావ్యతిరేకత ఉంది. సహజంగానే అది కాంగ్రెస్‌ వంటి పార్టీలకు లాభించాలి. అంటే, అందుకు పార్టీకి సరైన భూమిక, సంస్థాగత నిర్మాణం, పార్టీ యంత్రాంగం, జనంలో విశ్వసనీయత ఉండాలి. అవన్నీ సమీకృతం చేసి కాంగ్రెస్‌ను ఏపీలో ఓ బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలి. ఈ బాధ్యత రాష్ట్ర నాయకత్వంపై ఎంతుందో, అంతకు మించి ఢిల్లీ నాయకత్వంపైనా ఉంది. రాష్ట్రం గుండా ఇటీవలే సాగిన ‘భారత్‌ జోడో’ రాహుల్‌ పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహాన్ని నింపింది. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పార్టీ నాయకత్వ మార్పిడి కూడా రెండు స్థాయిల్లో జరిగింది. ఇక ఏయే విధానాలతో రాష్ట్రంలో పార్టీని ఐక్యంగా ఉంచుతారు, ఏయే నిరవదిక ప్రజా కార్యక్రమాలిచ్చి, ఎటువంటి అంశాల్లో నిర్దిష్ట హామీలివ్వడం ద్వారా పార్టీని ఎలా ముందుకు నడుపుతారన్నది ముఖ్యం.

వారిపై ఎక్కువ ఆధారపడితే గుల్ల

కాలం మారుతోంది. పాతతరం తెరవెనక్కి పోతున్నట్టే కొత్తతరం ప్రాధాన్యత పెరుగుతోంది. దీని దృష్ట్యా పార్టీలో పెద్దవాళ్ల పాత్ర ప్రమేయం క్రమంగా తగ్గించాలి. పెద్ద పేర్ల కన్నా జనాదరణ, పార్టీకి వారందించే సేవలే ముఖ్యం. గెలుపోటములే అన్నిసార్లూ ప్రామాణికం కాదు. 1978 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచే వరకు ‘వక్కలగడ్డ ఆదాము’ ఎవరో ఎవరికీ తెలిసింది కాదు. కానీ, కోట పున్నయ్య, కోట రామయ్య వంటి దిగ్గజాలను ఓడించి, కాంగ్రెస్‌ (ఇందిరా) పార్టీ తరపున 40 శాతం ఓట్లతో గెలిచారు. అది ఏకపక్ష గాలి ప్రభావం. గాలి అనుకూలంగా లేనప్పుడే ఆచీతూచి, వ్యూహాత్మకంగా కొత్త పాతల మేళవింపుతో నాయకత్వం ముందుకు వెళ్లాలి. ఏపీలో ఇప్పుడదే పరిస్థితి. పార్టీ అధినాయకత్వం ఇటీవల ప్రకటించిన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు నిర్దిష్టమైన ఓటుబ్యాంకుల్లేవు.

కిందటి ఎన్నికల్లో ఒకరు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 14,205 (1.05 శాతం) ఓట్లు తెచ్చుకుంటే మరొకరు అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 7878 (0.64 శాతం) ఓట్లు పొందారు. నగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కు 3357 (2 శాతం) ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (మహిళ)కు 2506 (1.25 శాతం) ఓట్లు మాత్రమే లభించాయి. ప్రచార కమిటీ నేతగా నియమించిన జి.వి.హర్షకుమార్‌ పదేళ్లపాటు ఎంపీ. ఆయన 2014లో అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి సమైక్యాంధ్ర (చెప్పు గుర్తు) పార్టీ తరపున పోటీ చేస్తే 9931 (0.73 శాతం) ఓట్లు దక్కాయి. అంతకు మున్నే ఎంపీగా, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో ఎనిమిదేళ్లు మంత్రిగా ఉండి, 2014లో కాకినాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన పల్లంరాజుకు 19528 (1.8 శాతం) ఓట్లు లభించాయి. ఏఐసీసీ ప్రాగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీకి ఆయన నియమితులయ్యారు. ఇదీ వరస!

నిబద్దతే కొలబద్ద!

విభజన తర్వాత మాజీ మంత్రి రఘువీరారెడ్డి పీసీసీ పీఠమెక్కారు. కోటి సంతకాల సేకరణ, జైల్‌ బరో, ప్రత్యేక హోదా, స్పెషల్‌ ప్యాకేజీ డిమాండ్లు... రకరకాల కార్యక్రమాలతో పార్టీని జనంలో ఉంచేందుకు యత్నించారు. 2014లో పెనుగొండ నుంచి అసెంబ్లీకి ఆయన పోటీ చేస్తే 16.494 (9.8శాతం) ఓట్లు లభించాయి. 2019లో కళ్యాణదుర్గం నుంచి బరిలో దిగితే 28,883 (15.14 శాతం) ఓట్లోచ్చాయి. ఉన్నంతలో ఇవి మెరుగైన ఫలితాలే! నిజానికి ఆయన 2019లో గెలవాల్సింది. కానీ, అంతకు ముందు తగిన చర్చ, కార్యకర్తలతో సంప్రదింపులు లేకుండానే నియోజకవర్గం మారారనే కోపం స్థానికుల్లో ఉండటం వల్ల ఓడారనే వాదన ఉంది. పనిచేసే వారికి ప్రజాదరణ ఉంటుందనేందుకు ఇది నిదర్శనం.

నిన్నటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మరో మాజీ మంత్రి, మాజీ విప్‌ శైలజానాథ్‌ది ఇందుకు పూర్తి భిన్నమైన కేసు. తాను ప్రాతినిధ్యం వహించిన సింగనమల నుంచి పోటీ చేస్తే 2014 లో 2176 (1.23 శాతం) ఓట్లు, 2019లో 1384 (0.70 శాతం) ఓట్లు మాత్రమే పడ్డాయి. ప్రజల్లోకి వెళ్లకుండా, వారిని ఆదుకునే జనాందోళన కార్యక్రమాలు రూపొందించకుండా, వారి ఓట్లు పొందటం ఎంతటి విపక్షానికైనా కష్టం. ఇదివరకు ఏ అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీ చేయకపోయినా.. ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల) గా, కార్పొరేషన్‌ చైర్మన్‌గా, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ తరపున పనిచేసిన అనుభవం పీసీసీ కొత్త అధ్యక్షుడు రుద్రరాజుకు ఉంది. దాన్ని ఉపయోగించి అటు సీనియర్ల సహకారం, ఇటు యువతరం మద్దతు పొందితే కాంగ్రెస్‌ పునరుద్దరణకు ఆయనకు దారి దొరకొచ్చు.

ఘర్‌ వాపసీ, యువరక్తం మేళవిస్తేనే...

కాంగ్రెస్‌ పునరుద్దరణ గురించి మాట్లాడితే నవ్వుతున్నారు జనం. దశాబ్దాల కిందట బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో వచ్చినట్టే, ‘ఇంకెక్కడి కాంగ్రెస్‌?’ అనే మాట ఏపీలో వినిపిస్తోంది. కాంగ్రెస్‌ మెరుగుపరచాలంటే, పార్టీ నుంచి వెళిపోయి ఇతర పక్షాల్లో, ముఖ్యంగా పాలక వైసీపీలో చేరిన నాయకుల్లో కొందరినైనా ముఖ్యుల్ని, ముఖ్యంగా ద్వితీయ, అంతకన్నా కింది స్థాయి నాయక, కార్యకర్తల శ్రేణుల్ని వెనక్కి తీసుకురాగలిగితే ఉపయోగమనే భావన వ్యక్తమౌతోంది. జనం నిరాధరణతో పార్టీ అచేతనంగా మారి, దిక్కులేక కాంగ్రెస్‌ శ్రేణులు దశల వారిగా ఇతర పార్టీలకు వెళ్లాయి.

2014 సాధారణ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థికి 2008 (1.28 శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికైన టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్‌ ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. వైసీసీ పోటీ పెట్టలేదు, దాంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఉప ఎన్నికలో 24,931 ఓట్లు లభించాయి. తిరుపతి ఉప ఎన్నికలోనూ దాదాపు ఇదే పరిస్థితి! దీన్ని బట్టి వైసీపీలో కాంగ్రెస్‌ ఓటు ఎంతో తెలిసిపోతుంది. కార్యకర్తలు, సానుభూతిపరులే కాకుండా కొంతమంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా తమ భవిష్యత్తును వెత్తుక్కుంటూ ఇతర పార్టీల వైపు, ముఖ్యంగా వైసీపీ వైపు వెళ్లారు. అయినా అక్కడ అవకాశాలు రానివారు, వచ్చి మంత్రిపదవులు లభించినా వేర్వేరు కారణాల వల్ల ఇప్పుడు అసంతుష్టులుగా ఉన్న వారు ఎందరో! సంప్రదింపులు, సయోధ్యతో వారిని వెనక్కి తెచ్చే యత్నం కాంగ్రెస్‌కు లాభిస్తుంది.

దీనికి తోడు యువతరాన్ని పార్టీ వైపు ఆకట్టుకోవాలి. ముఖ్యంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పనిచేస్తున్న స్థానికసంస్థలకు ఎన్నికైన, పోటీపడ్డ నాయకులు, కార్యకర్తలపై దృష్టి నిలపాలి. ఇదంతటికీ ప్రజాదరణే గీటురాయి కావాలి. 1997-2004 మధ్య పుట్టిన ఒక తరం యువతకు కాంగ్రెస్‌ గురించి, అది చేసిన మంచిపనుల గురించి బొత్తిగా తెలియదు. వారి సెంట్రిక్‌గా కార్యక్రమాలు రూపొందించి, అవగాహన పెంచి పార్టీవైపు ఆకట్టుకోగలగాలి. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి వంటి సీనియర్‌ నాయకులు పూనికతో నడుం కడితే, ఏపీలో కాంగ్రెస్‌ పునరుద్దరణకు ఎంతో కొంత అవకాశం ఉంటుంది.

ప్రజాసమస్యలపై అధ్యయనం అవసరం

ప్రత్యేక హోదానా? విభజన హామీలా? నిత్యావసరాల ధరల నియంత్రణా? అంశాలు ఏవైనా.... ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయాలి. వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆయా విషయాల్లో కాంగ్రెస్‌ విధానాలేంటో? ఇతరుల కన్నా ఎలా భిన్నమో? అవి ప్రజలకు ఏ విధంగా అనుకూలమో విడమర్చాలి. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులు లోపాలను ఎత్తి చూపాలి. అందుకు, అవసరమైన ప్రజాఉద్యమాలు నిర్మించాలి. జనంతో నిరంతరం మమేకం కావాలి. యువరక్తాన్ని పార్టీ నిర్మాణంలో భాగం చేయాలి. సీనియర్ల అనుభవాన్నీ పరిగణనలోకి తీసుకుంటూ పాత, కొత్త తరాల మధ్య సయోధ్య సాధించాలి. తెలుగుదేశం చతికిల పడిన, బీజేపీ విఫలమైన, జనసేన కొత్త నమ్మకం కలిగించలేకపోయిన... అన్ని అంశాల్లోనూ తానే తగిన ప్రత్యామ్నాయం ఇవ్వగలనన్న నమ్మకాన్ని ఏపీ ప్రజానీకానికి కలిగిస్తేనే కాంగ్రెస్‌కు మనుగడ.

- దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ ఆనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Mail: dileepreddy.ic@gmail.com, Cell No: 9949099802

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ పొలిటికల్‌ ఆనలిస్ట్‌ దిలీప్ రెడ్డి,
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ పొలిటికల్‌ ఆనలిస్ట్‌ దిలీప్ రెడ్డి,
IPL_Entry_Point