ఏపీలో రేషన్ సరఫరా కోసం వినియోగిస్తున్న మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్ తర్వాత రాష్ట్రంలో అక్రమాలు ఆగిపోతాయని భావించినా అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమాలపై పెద్ద ఎత్తున తనిఖీలు, దాడులు చేశారు.
ఈ క్రమంలో రేషన్ డీలర్లు, మొబైల్ డెలివరీ యూనిట్లు కలిసి రేషన్ బియ్యాన్ని కారు చౌకగా కొనుగోలు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఎండీయూలను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. తాజాగా క్యాబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ బియ్యాన్ని 2019కు ముందు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేవారు. 2019లో రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఇళ్లకే సరుకులు పంపిణీ చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికి రేషన్ పంపిణీ ఆచరణలో సాధ్యం కాదని భావించి మొబైల్ డెలివరీ యూనిట్లతో ప్రాంతాల వారీగా రేషన్ సరఫరాను ప్రారంభించారు.
ఈ క్రమంలో రేషన్ బియ్యాన్ని వినియోగించడం కంటే అక్రమంగా సొమ్ము చేసుకోవం అధికమైంది. మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా బియ్యాన్ని రేషన్ కార్డు దారుల నుంచి కొనుగోలు చేసి వాటిని పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని సార్లు రేషన్ కార్డుదారులకు బియ్యం స్థానంలో నామమాత్రపు డబ్బు చెల్లించి అటు నుంచి అటే బియ్యాన్ని మాయం చేస్తున్నారు.
అక్రమాల నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని నిలిపి వేసి, గతంలో మాదిరిగానే చౌక ధర దుకాణాల ద్వారా నేరుగా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేషన్ కార్డుదారులు ఇచ్చిన ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్‌లొ మొత్తం కార్డుల్లో 25% మంది నిత్యావసర సరుకులు అందకపోవడం, 26% మంది ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు అందాయి. ప్రతి రేషన్ వాహనం మూడు రేషన్ దుకానాలకు సంబంధించిన ప్రాంతాలను 15-17 రోజుల్లో మాత్రమే కవర్ చేయడం వంటి లోపాలను గుర్తించారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ.353.81 కోట్లు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఏపీలో 2019కు ముందు 29 వేల చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానం అమల్లో ఉండేది. వైసీపీ ప్రభుత్వం 9,260 వాహనాల కొనుగోలుకు రూ.1860 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి రేషన్ పథకాన్ని ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుకోసం మరో రూ.200 కోట్లను వెచ్చించారు.
రేషన్ వాహనాల వల్ల వినియోగ దారులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. రైస్ స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగింది. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వ్యాను ఆపరేటర్లపై దాదాపు 200 కేసులు బుక్ చేశారు. ప్రతి నెలలో మూడు రోజుల్లోనే 93 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు లెక్కలు చూపిస్తున్నా వినియెగ దారులకు సరుకులు అందడం లేదు. ఒక్కొక్క వాహనానికి నెలకు రూ.27 వేల చొప్పున కార్పొరేషన్ నుండి చెల్లిస్తున్నారు. 570 వ్యాన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని మంత్రి నాదెండ్ల చెప్పారు.
రేషన్ బియ్యం వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బిసీ, ఈబీసీ కార్పొరేషన్ ల ద్వారా వాహనాలు పొందిన వారిలో ఎవరైతే 10 శాతం కడితే వారికి ఈ వాహనాలను ఉచితంగా అందచేయాలని నిర్ణయించారు. వాహనాల కోసం రూ.385కోట్లను ఏటా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చు మిగులుతుందని భావిస్తున్నారు.
జూన్ 1 నుండి చౌకధరల దుకాణాలలో మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తారు. చౌకధరల దుకాణాల్లో ఇతర సరుకులు కూడా అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిస్తారు.
ఏపీలో రేషన్ బియ్యం పంపిణీ కోసం ఏటా వేల కోట్ల రుపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి పేదలకు అందించేందుకు ఒక్కో కిలోకు రూ.43.50వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని ఆహారంగా వినియోగించే వారు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. ఏపీలో దాదాపు కోటిన్నర రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ బియ్యం స్థానంలో నేరుగా నగదు బదిలీ చేయాలని ప్రతిపాదనలు ఉన్న రాజకీయ కారణాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదు.
మరోవైపు ప్రభుత్వం కొనుగోలు చేసే బియ్యాన్ని తక్కువ ధరకు దళారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఈ వ్యవస్థల్లో ఎలాంటి మార్పు రాలేదు. రేషన్ బ్లాక్ మార్కెటింగ్ యథేచ్చగా కొనసాగుతోంది. మొబైల్ డెలివరీ యూనిట్లను రద్దు చేసినా అక్రమ తరలింపుకు అడ్డు కట్ట పడుతుందనే గ్యారెంటీ లేదు. బ్లాక్ మార్కెటింగ్ మాఫియాకు బలమైన రాజకీయ అండదండలు ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
సంబంధిత కథనం