Pathipati Venkayamma: ఎమ్మెల్యే శ్రీమతి గారా మజాకా? పత్తిపాటి వెంకాయమ్మ పుట్టినరోజు హంగామా
Pathipati Venkayamma: ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నా కొందరు టీడీపీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. భర్త అధికారాన్ని అడ్డు పెట్టుకుని హడావుడి చేసే భార్యలు, భార్య అధికారంతో చెలరేగే భర్తలు ఎక్కడా తగ్గడం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఒకే రోజు చిక్కుల్లో పడ్డారు.
Pathipati Venkayamma: సీఐలు, ఎస్సైల సమక్షంలో ఓ సాధారణ గృహిణి పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం కలకలం సృష్టించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లరావు సతీమణి మంగళవారం పోలీసుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అధికారం లేని మహిళ పుట్టిన రోజును పోలీసులు జరపడంలో ఆంతర్యం ఏమిటని వైసీపీ ప్రశ్నించింది.
కొద్ది రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఎవరు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే రకమైన సూచనలు చేశారు. సమీక్షల్లో ఆరణి బంధువుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, ఎక్సైజ్ సీఐలు చప్పట్లు కొడుతుండగా పత్తిపాటి వెంకాయమ్మ కేక్ కట్ చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి అలియాస్ వెంకాయమ్మ పుట్టిన రోజు సందర్భంగా పోలీసులు ఇలా ఘనంగా వేడుకలు నిర్వహించారు.
వెంకాయమ్మకు ఎలాంటి అధికారిక హోదా లేదు! మంగళవారం ఆమె పుట్టిన రోజు కావడంతో చిలకలూరిపేట అర్బన్, రూరల్ పోలీస్ అధికారులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేకు తీసుకొచ్చి ఆమెతో కట్ చేయించి... చప్పట్లు కొట్టారు. 2014-19 మధ్య కాలంలో పత్తిపాటి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కంటే ఎక్కువ అధికారాన్ని ఆయన సతీమణి వెలగబెట్టారు. ఇటీవల ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడానికి అదే కారణమనే ప్రచారం కూడా ఉంది.
నియోజక వర్గంలో నియామకాలు, సెటిల్‌మెంట్లు, దందాలు మొత్తం ఎమ్మెల్యే భార్య ఆధ్వర్యంలో జరిగేవని గతంలోనే విమర్శలు ఉన్నాయి. వాటికి అద్దం పట్టేలా పోలీస్ అధికారులు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడంపై వైసీపీ ట్రోల్ చేస్తోంది. పత్తిపాటి మంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు వివాదాలతో వెంకాయమ్మ వార్తల్లోకి ఎక్కారు.
ఎమ్మెల్యే మొగుడా మజాకా…
నాలుగు ఎకరాల భూమిని రూ.30లక్షలకే రిజిస్ట్రేషన్ చేయాలని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త రామచంద్రరావు బెదిరిస్తున్నారంటూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన కమ్మ వెంకట్రావు మంగళవారం ఆరోపించారు. ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ మంగళవారం బాధితులు గుంటూరు కోర్టును ఆశ్రయించారు.
వెంకట్రావుకు పిడుగురాళ్ల సమీపంలో 8 ఎకరాల పొలం ఉంది. గతేడాది గళ్ళా రామచంద్రరావు 4.90 ఎకరాల పొలాన్ని కొనేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఎకరం రూ.48 లక్షల చొప్పున అమ్మేందుకు 2023 ఏప్రిల్ 4న అగ్రిమెంట్ రాసుకున్నారు. రామచంద్రరావు 18 లక్షల చొప్పున 3 చెక్కులు, ఐదు లక్షల నగదు ఇచ్చాడని, అందులో ఒక చెక్కు మాత్రమే చెల్లిందని, మిగిలిన రెండూ బౌన్స్ అయ్యాయని మొత్తంగా రూ.23 లక్షలు మాత్రమే ముట్టాయని బాధితుడు తెలిపాడు.
ఒప్పందం చేసుకున్న 4.90 ఎకరాలతో పాటు రోడ్డు ఫేసింగ్‌లో ఉన్న 3.07 ఎకరాల పొలాన్ని కూడా ఆక్రమించేందుకు రామచంద్రరావు ప్రయత్నిస్తున్నాడని, రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే అందులో షెడ్డు నిర్మించడంతో తాను గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు తెలిపాడు. వివాదం నేపథ్యంలో రామచంద్రరావు ఈ ఏడాది ఫిబ్రవరి 23న అగ్రిమెంట్ చేసుకున్న 4.90 ఎకరాల్లో 3.90 ఎకరాలకు పూర్తి సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, రోడ్డు ఫేసింగ్‌లో ఉన్న మూడెకరాలతో పాటు ఒప్పందం చేసుకున్న దానిలో మిగిలిన ఎకరం కూడా తనకే విక్రయించాలని రామచంద్రరావు అడిగితే సొమ్ము పూర్తిగా చెల్లిస్తేనే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పానన్నారు.
ఎన్నికల్లో రామచంద్రరావు భార్య గళ్ళా మాధవి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో నాలుగు ఎకరాలు రూ.30లక్షలకే ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని కోర్టును ఆశ్రయించారు. తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, తనపై పలుమార్లు దాడులు చేశారని, ప్రాణ రక్షణ కల్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు.