Visakhapatnam : భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ వేధించిన భర్త.. నవ వధువు ఆత్మహత్య
Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరం జరిగింది. భార్యకు అశ్లీల వీడియోలు చూపించి, అలానే చేయాలని భర్త వేధింపులకు పాల్పడ్డాడు. భర్త వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని.. ఆయన వద్ద ఉన్న ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో తీవ్ర విషాదం జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక.. నవ వధువు సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన నాగేంద్రబాబుకు, 23 ఏళ్ల యువతితో గతేడాది వివాహం అయింది. నాగేంద్రబాబు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ అశ్లీల చిత్రాలకు బానిస అయ్యాడు. రకరకాల మాత్రలు వేసుకుంటూ.. అశ్లీల వీడియోలను భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధించేవాడు. అందుకు అతని భార్య నిరాకరించేది.
ఇద్దరి మధ్య గొడవ..
ఈ గురువారం అర్థరాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగేంద్ర భార్య శుక్రవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఆయన వద్ద ఉన్న ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం.. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.
శృంగార వాంఛలతో..
మితిమీరిన కోరికలు, శృతిమించిన అసహజన శృంగార వాంఛలతో నాగేంద్ర వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. నాగేంద్రలో కామం వికృత రూపం దాల్చడంతో టార్చర్‌ను భరించలేకపోయిందని వాపోయారు. తన భర్తను మార్చేందుకు ప్రయత్నించిందని, ఆయనలో మార్పు రాలేదని, తల్లిదండ్రుల వద్ద బాధితురాలు వాపోయిందని చెబుతున్నారు.
తల్లిదండ్రుల ఆరోపణలు..
తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని.. కొన్ని రోజులుగా తమకు ఈ విషయాన్ని చెబుతోందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. గురువారం రాత్రి కూడా ఫోన్ చేసిందని, తాము వచ్చి మాట్లాడుతామని చెప్పినట్లు తెలిపారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య అంటూ మృతురాలి తల్లి ఆరోపించారు.
నిందితుడు అరెస్టు..
నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని యువతి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)