Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరం.. పదేళ్లుగా భార్యను పుట్టింటికి పంపని భర్త.. భార్య ఆత్మహత్య
Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. భార్యను పదేళ్లుగా భర్త పుట్టింటికి పంపలేదు. పైగా వేధింపులు, భౌతిక దాడికి దిగేవాడు. తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మృతిరాలి బంధువులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్లలో విషాదం జరిగింది. చింతగట్ల గ్రామానికి చెందిన గనిశెట్టి కనకరాజుకు నర్సీపట్నం మర్రివలసకు చెందిన పార్వతితో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కనకరాజు, పార్వతి (35) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కనకరాజు సొంతంగా కారు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య పార్వతిని కనకరాజు నిత్యం వేధించేవాడు.
పదేళ్లుగా..
దాదాపు పదేళ్లుగా ఆమెను తన పుట్టింటికి కూడా వెళ్లనివ్వలేదు. నిత్యం ఏదో ఒక కారణంతో చేయిచేసుకునేవాడు. భోగి ముందు రోజు కూడా పార్వతిని తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కార్ ఏసీ కూలెంట్ వాటర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.
బంధువుల ఆందోళన..
బుధవారం ఉదయం పోస్టుమార్టం చేసి.. తరువాత ఆమె మృతదేహాన్ని చింతగట్ల గ్రామానికి తీసుకువచ్చారు. తమ కుమార్తె మృతికి కారణమైన కనకరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్వతి కుటుంబ సభ్యులు కనకరాజు నివాసంలోనే మృతదేహాన్ని పూడ్చుతామంటూ గొయ్యి తవ్వడానికి ప్రయత్నించారు.
తీవ్ర ఉద్రిక్తత..
ఈ క్రమంలో కనకరాజు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పెందుర్తి సీఐ సతీష్ కుమార్ ఇరు వర్గాలను సముదాయించి చర్చలు జరిపారు. చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో పార్వతి కుటుంబ సభ్యులు శాంతించారు.
పోలీసుల అందుపులో నిందితుడు..
ఆందోళన చేస్తున్న పార్వతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, అంత్యక్రియలు నిర్వహించారు. కనకరాజును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కేవీ సతీష్ కుమార్ వెల్లడించారు. పార్వతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)