Palnadu District : ప్రియురాలితో వివాహేత‌ర సంబంధం - భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య-wife caught the husband red handed while living with his girlfriend in palnadu district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palnadu District : ప్రియురాలితో వివాహేత‌ర సంబంధం - భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Palnadu District : ప్రియురాలితో వివాహేత‌ర సంబంధం - భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

HT Telugu Desk HT Telugu
Feb 05, 2025 11:18 AM IST

ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తతోపాటు ప్రియురాలికి బంధువులు దేహశుద్ది చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని బోయకాలనీలో వెలుగు చూసింది. భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రియురాలితో భర్త వివాహేత‌ర సంబంధం..!
ప్రియురాలితో భర్త వివాహేత‌ర సంబంధం..! (image source unsplash.com)

భార్య‌తో గొడ‌వ పెట్టుకున్న భ‌ర్త‌… బంధువుల అమ్మాయితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఏకంగా సంసారం పెట్టేశాడు. అయితే భర్తపై నిఘా పెట్టిన భార్య… రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దేహ‌శుద్ధి చేసిన బంధువులు వారిని పోలీసులకు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న ప‌ల్నాడు జిల్లా సత్తెనప‌ల్లి ప‌ట్ట‌ణంలోని జరిగింది.

yearly horoscope entry point

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం… సత్తెన‌ప‌ల్లి చెంచుకాల‌నీకి చెందిన ఆకుల వాసుకు, న‌క‌రిక‌ల్లు మండ‌లం చ‌ల్ల‌గుండ్ల గ్రామానికి చెందిన‌ న‌వ్య‌శ్రీ‌తో వివాహం జ‌రిగింది. న‌వ్యశ్రీ స్వ‌యాన అక్క కూతురే. రెండేళ్ల క్రితం వాసు, న‌వ్య‌శ్రీకి వివాహం జ‌రిగింది. ఈ యువ దంప‌తుల‌కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్లాస్టిక్ వ‌స్తువులు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నారు.

బంధువుల అమ్మాయితో….

హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న బంధువుల అమ్మాయితో వాసుకి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. దీంతో ఆమెతో వాసు సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విష‌య‌మై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య నిరంత‌రం గొడ‌వలు జ‌రుగుతునే ఉన్నాయి. అయితే న‌వ్య‌శ్రీ పేరు మీద ఉన్న రెండు సెంట్ల స్థ‌లాన్ని త‌న‌పేరుతో రిజిస్ట్రేష‌న్ చేస్తేనే కాపురం చేస్తాన‌ని వాసు మెలిక పెట్టాడు. దీంతో వీరి గొడవ విషయంలో పెద్ద‌లు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది.

భర్త తీరుపై అనుమానం….!

పెద్దలు మాట్లాడినప్పటికీ ఫ‌లితం లేక‌పోయింది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వలు స‌ద్దుమణ‌గ‌లేదు. దీంతో న‌వ్య‌శ్రీ ఇటీవ‌లే కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అక్క‌డే కొన్ని రోజులుగా ఉంటూ భ‌ర్త తీరుపై మొద‌టి నుంచి ఉన్న అనుమానంతో ఆమె భ‌ర్త క‌ద‌లిక‌ల‌పై క‌న్నేసింది. దీంతో సత్తెన‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలోని బోయ‌కాల‌నీలోని స‌మీప బంధువు ఇంట్లో ప్రియురాలితో ఉంటున్నట్లు సమాచారం తెలుసుకుంది.

వెంట‌నే బంధువుల‌తో క‌లిసి సోమ‌వారం అర్థ‌రాత్రి అక్క‌డికి వెళ్లింది. ప్రియురాలితో ఉన్న భ‌ర్త‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్య త‌ర‌పు బంధువులతో వాసు గొడ‌వ పెట్టుకున్నాడు. దీంతో ఆమె బంధువులు వాసుకి దేహ‌శుద్ధి చేశారు. అలాగే ప్రియురాలికి కూడా దేహ‌శుద్ధి చేసి… ఇద్ద‌రిని పోలీసులకు అప్ప‌గించారు.

భార్య న‌వ్య‌శ్రీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. త‌న భర్త వేరొక అమ్మాయితో వివాహేత‌ర సంబంధం న‌డుపుతున్నాడ‌ని పేర్కొంది. త‌న‌కు అన్యాయం చేస్తున్నాడని… అతనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స‌త్తెన‌ప‌ల్లి సీఐ బ్ర‌హ్మం స్పందిస్తూ… న‌వ్య‌శ్రీ ఫిర్యాదు మేర‌కు ఆమె భ‌ర్త‌పై కేసు న‌మోదు చేశామ‌ని… విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. వాసుపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌వ్య‌శ్రీ త‌ర‌పు బంధువులు పోలీసుల‌ను కోరారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం