AP Crime News : వివాహేతర సంబంధం..! భర్తను హత్య చేసిన భార్య -యావజ్జీవ కారాగార శిక్ష‌ విధించిన కోర్టు-wife brutally murdered her husband sentenced to life imprisonment in visakhapatnam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Crime News : వివాహేతర సంబంధం..! భర్తను హత్య చేసిన భార్య -యావజ్జీవ కారాగార శిక్ష‌ విధించిన కోర్టు

AP Crime News : వివాహేతర సంబంధం..! భర్తను హత్య చేసిన భార్య -యావజ్జీవ కారాగార శిక్ష‌ విధించిన కోర్టు

HT Telugu Desk HT Telugu
Nov 21, 2024 10:46 AM IST

అక్క కొడుకుతో భార్య వివాహేత‌ర సంబంధం నడిపింది. ఈ విషయంలో భర్తకు తెలియడంతో మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను హత్య చేసింది. ఇందుకు మరో ఇద్దరు సహకరించారు. ఈ కేసులో విశాఖ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష‌ విధించింది.

భర్తను అతి కిరాత‌కంగా హత్య చేసిన భార్య - యావజ్జీవ కారాగార శిక్ష‌
భర్తను అతి కిరాత‌కంగా హత్య చేసిన భార్య - యావజ్జీవ కారాగార శిక్ష‌ (image source pixabay)

అక్క కొడుకుతో వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలో భ‌ర్త‌ను అతి కిరాత‌కంగా హ‌త్య చేసిన మ‌హిళ‌తో పాటు మ‌రో ఇద్ద‌రికి యావ‌జ్జీవ కారాగార శిక్ష ప‌డింది. జైలు శిక్ష‌తో పాటు నిందితులు రూ.1.50 ల‌క్ష‌లు జ‌రిమానా చెల్లించాల‌ని.. ఆ మొత్తంలో రూ.1.20 ల‌క్ష‌లు మృతి చెందిన వ్య‌క్తి పిల్ల‌ల‌కు ఇవ్వాల‌ని విశాఖ‌ప‌ట్నం జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆల‌పాటి గిరిధ‌ర్ తీర్పు ఇచ్చారు.

ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కాండ్రేగుల జ‌గ‌దీశ్వ‌ర‌రావు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… విజ‌య‌న‌గరం జిల్లా భోగాపురం మండలం మోద‌వ‌ల‌స గ్రామానికి చెందిన బాడిద బోయిన రాముల‌ప్పుడికి 2008లో విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌ద్మ‌నాభం మండ‌లం కురుప‌ల్లి గ్రామానికి చెందిన న‌ర‌స‌య్య‌మ్మ‌తో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. పెళ్లైన కొంత కాలం త‌రువాత న‌ర‌స‌య్య‌మ్మ త‌న అక్క కొడుకు గండిబోయిన అప్ప‌ల‌రాజుతో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఈ విష‌య‌మై రాముల‌ప్పుడు, న‌ర‌స‌య్య‌మ్మ త‌ర‌చూ గొడ‌వ ప‌డేవారు.

2028 ఫిబ్ర‌వ‌రి 13న శివ‌రాత్రి పండ‌గ‌కు రాముల‌ప్పుడు త‌న స్వ‌గ్రామ‌మైన మోద‌వ‌ల‌స వెళ్లాడు. భార్యా పిల్ల‌లు కూడా వెంట తీసుకొని వెళ్లారు. మోదవ‌ల‌స‌లో రామ‌ప్పడును చంప‌డానికి అప్ప‌ల‌రాజుతో క‌లిసి న‌ర‌స‌య్య‌మ్మ ప‌థ‌కం ర‌చించింది. అప్ప‌ల‌రాజు త‌న త‌మ్ముడు ఎల్లారావుతో క‌లిసి రాముల‌ప్పుడును చంప‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. రాత్రి స‌మ‌యంలో రాముల‌ప్ప‌డును క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాద‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వెంట‌నే ముగ్గురూ క‌లిసి మృతిడిని మోదవ‌ల‌స నుంచి ప‌ద్మ‌నాభం మండ‌లం కురిప‌ల్లికి తెచ్చి వ‌దిలేశారు.

ఆ త‌రువాత వారు మ‌ళ్లీ మోద వ‌ల‌స వెళ్లిపోయారు. త‌న అన్న‌య్య అనుమాన‌స్ప‌దంగా చ‌నిపోయాడ‌ని రాముల‌ప్పుడు త‌మ్ముడు ఆనంద‌పురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఆనంద‌పురం పోలీసులు ద‌ర్యాప్తు జ‌రిపి, నిందితుల‌పై కేసు న‌మోదు చేశారు. ఐపీసీ 302, 120 బీ, 364 సెక్ష‌న్ల కింద పోలీసులు చార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేశారు. నేరం రుజువు కావ‌డంతో న్యాయ‌మూర్తి ఆల‌పాటి గిరిధ‌ర్ ఇద్ద‌రికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌తో పాటు రూ.1.50 ల‌క్ష‌లు జ‌రిమానా చెల్లించాల‌ని, ఆ మొత్తంలో రూ.1.20 ల‌క్ష‌లు మృతి చెందిన వ్య‌క్తి పిల్ల‌ల‌కు ఇవ్వాల‌ని తీర్పు ఇచ్చారు.

అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న గండిబోయిన ఎల్లారావు మైన‌ర్ కావ‌డంతో వేరే న్యాయ‌స్థానంలో కేసు ద‌ర్యాప్తు జ‌రిగింది. ఎల్లారావుకు మూడేళ్ల జైలు శిక్ష విధించి, బాల‌ల సంర‌క్ష‌ణ ప‌రివ‌ర్త‌న కేంద్రానికి పంపించారు. త‌ల్లి జైలుకి వెళ్ల‌డం, తండ్రి మృతి చెంద‌డంతో పిల్ల‌ల సంర‌క్ష‌ణ చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌కు జిల్లా న్యాయ‌మూర్తి ఆల‌పాటి గిరిధ‌ర్ సూచించారు.

చిన్నారిపై లైంగిక దాడి...20 ఏళ్లు జైలు శిక్ష‌:

చిన్నారిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జ‌రిమానా విధించారు. ఈ మేర‌కు ఒంగోలు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల విచార‌ణ ప్ర‌త్యేక కోర్టు ఏడో అద‌న‌పు జిల్లా జ‌డ్జి టి.రాజా వెంక‌టాద్రి తీర్పు ఇచ్చారు.

ప్ర‌త్యేక ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ వై.వెంక‌టేశ్వ‌ర్లు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాప‌ట్ల జిల్లా చిన‌గంజాం మండ‌లం ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక రెండో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. 2018 మార్చి 20న ఆ బాలిక‌పై అదే గ్రామానికి చెందిన ద‌డ్డు చిన్నబ్బాయి లైంగిక దాడి చేస్తుండ‌గా, అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న బాలుడు కేక‌లు వేయ‌గా అత‌డు అక్కడి నుంచి ప‌రార‌య్యాడు.

విష‌యం తెలుసుకున్న బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖ‌లు చేశారు. ఈ కేసును విచారించిన జ‌డ్జి నిందితుడిపై నేరారోప‌ణ‌లు రుజువ‌వ్వ‌డంతో ఇరువై ఏళ్ల జైలు శిక్ష‌, రూ.10 వేల జ‌రిమానా విధించారు. బాధితురాలికి రూ.7 ల‌క్ష‌ల ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారం అందేలా చూడాల‌ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ‌కు సూచించారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner